వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కల్పించాలి
- జీవిత భద్రత, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
- మృతి చెందిన వార్డు సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌కు వార్డు మెంబర్స్ ఫోరం వినతిపత్రం
నాగర్‌కర్నూల్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న వార్డు మెంబర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి గౌరవ వేతనం, జీవిత భద్రత, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షురాలు నకినమోని ధనలక్ష్మి రాములు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి యాదవ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రతి వార్డు సభ్యునికి గౌరవప్రదమైన నెలవారీ వేతనం అందించాలని, వార్డు సభ్యుడు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ఆరోగ్య కార్డులు మంజూరు చేసి వైద్య భద్రత కల్పించాలని కోరారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సంబంధిత వార్డు సభ్యుల పేర్లను తప్పనిసరిగా పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న వార్డు మెంబర్లకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరెకంటి శివప్రసాద్‌తో పాటు పలువురు వార్డు మెంబర్లు పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.





