లక్ష్యసాధనే నేటి యువత కర్తవ్యం: సినీ నటుడు సుమన్
ఘనంగా విజనరీస్ కంక్లేవ్–2026 జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం
తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ప్రముఖులకు సత్కారం
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. యువత స్పష్టమైన లక్ష్యంతో, సరైన మార్గంలో ముందుకు సాగినప్పుడే దేశాభివృద్ధిలో భాగస్వాములు కాగలరని పేర్కొన్నారు.
సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర్ ఆడిటోరియంలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో–కెనెడియన్ యూత్ కౌన్సిల్, పుడమి సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘విజనరీస్ కంక్లేవ్–2026’ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కళారత్న డాక్టర్ చిలుముల బాల్‌రెడ్డి అధ్యక్షతన, అసోసియేషన్ చైర్మన్ అద్దంకి రాజా యోనా నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి సుమన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, లక్ష్యం లేని ప్రయాణం దిక్సూచి లేని నావ వంటిదని అన్నారు. యువత భవిష్యత్తుకు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. స్పష్టమైన దార్శనికతతో, పట్టుదలతో కృషి చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం సులువవుతుందని తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడుతూ, దేశ ప్రగతిలో సామాజికవేత్తల భాగస్వామ్యం అవసరమన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ప్రముఖులకు ‘విజనరీ–2026’ జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. జ్ఞాపికలు, పతకాలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు. శ్రీ వారాహి కూచిపూడి డాన్స్ అకాడమీ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యురు శేషసాయి, తెలంగాణ సమాచార కమిషనర్ దిశాల భూపాల్, ఆధ్యాత్మికవేత్త నార్ని అమర్‌చంద్, మానవ హక్కుల సంఘం జాతీయ చైర్‌పర్సన్ డాక్టర్ ఉన్నం జ్ఞానసుందరి, జాతీయ వైస్ చైర్మన్ డాక్టర్ గొల్లమందల ధానయ్య, డాక్టర్ చప్పిడి సత్యనారాయణ, పెద్దినేని సురేంద్రబాబు, డాక్టర్ జాహ్నవిదేవి తదితరులు పాల్గొన్నారు.





