సికింద్రాబాద్, నవంబర్ 18,
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనలో సానుకూల పరిణామం చోటుచేసుకుంది. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని వీసీ హామీ ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ.. ముందుగా ఉద్యోగులకు కడుపునిండా అన్నం పెట్టిన తర్వాతే పని చేయిస్తానని వీసీ పేర్కొన్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. చర్చల అనంతరం అక్కడే ఉన్న ఉద్యోగులందరికీ చర్చల సారాంశాన్ని వీసీ స్వయంగా వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమస్యల పరిష్కారం పట్ల ఆయన సానుకూలంగా స్పందించడంతో తమ డిమాండ్లు నెరవేరుతాయన్న నమ్మకం ఉద్యోగుల్లో ఏర్పడిందని నాయకులు తెలిపారు. మరోవైపు ఉద్యోగుల ఉద్యమానికి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి మద్దతు లభిస్తోందని జేఏసీ పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తదితరులు ఉద్యోగుల సమస్యలపై స్పందించి సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపింది. ఐఏఎస్ అధికారి యోగితా రాణా సైతం సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. గత 26 రోజులుగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విద్యార్థి, కార్మిక, పరిశోధక విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు నిరసన కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆందోళన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల ఐక్యత, వివిధ సంఘాల మద్దతుతో సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పడుతోందని, న్యాయమైన హక్కులు సాధించే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.





