హైటెక్స్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సదస్సు.. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
3,500 మంది ప్రతినిధులు, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్లు
రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి 2026–27 బడ్జెట్లో రూ.5,677 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: తెలంగాణ అభివృద్ధికి మెరుగైన రహదారి వ్యవస్థ కీలకమని, రాష్ట్రంలో రోడ్లు, హైవేల కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నవంబర్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ ) సమావేశాలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైటెక్స్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో సదస్సు వివరాలతో పాటు రాష్ట్రంలో చేపట్టనున్న రహదారి అభివృద్ధి ప్రాజెక్టులపై మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాలను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వ్యక్తిగతంగా కలిసి కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తిని అంగీకరించి తెలంగాణకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నవంబర్ 19న ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమావేశాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రోడ్లు, హైవేల రంగానికి చెందిన నిపుణులు, ఇంజినీర్లు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు కలిపి సుమారు 3,500 మంది హాజరవుతారని చెప్పారు.
ఏడోసారి హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్
1934లో ఏర్పాటైన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ దేశంలో రహదారులు, వంతెనల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత, భద్రత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో ఈ సంస్థ అనేక మార్పులకు కారణమైందన్నారు. ఇప్పటివరకు ఆరు సార్లు హైదరాబాద్‌లో IRC సమావేశాలు జరగగా, ప్రస్తుతం ఏడోసారి నగరం ఆతిథ్యం ఇస్తోందని వివరించారు. 1938లో దక్కన్ సంస్థానం కాలంలో నాలుగో IRC సమావేశం తొలిసారిగా హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం 1959లో 23వ సమావేశం, 1976లో 36వ సమావేశం, 1987లో 47వ సమావేశం, 1999లో 59వ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో 77వ IRC సమావేశం జరిగింది. ఇప్పుడు 85వ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఏఐ , డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ రోడ్లపై చర్చలు
ఈసారి సదస్సులో పర్యావరణహిత రహదారుల నిర్మాణం, వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక రవాణా వ్యవస్థలు, రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సురక్షితంగా నడిచే హక్కు కల్పించే 'రైట్ to వాక్ ' అంశంపై ప్రత్యేక ప్యానల్ చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్లు ఉంటాయని చెప్పారు. ఆధునిక యంత్రాలు, నిర్మాణ సాంకేతికతలు, కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
తెలంగాణలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను తెలంగాణ పెవిలియన్ ద్వారా దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ప్రదర్శిస్తామని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
రోడ్లు, బ్రిడ్జిలకు రూ.5,677 కోట్లు
రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలు, వ్యాపారాలు, పట్టణాలకు అనుగుణంగా మెరుగైన రహదారులు, కనెక్టివిటీ కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి చెప్పారు. 2026–27 బడ్జెట్లో రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.5,677 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రహదారి వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు రహదారి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఐఆర్సీ వేదికగా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణలో రోడ్ల నిర్మాణం, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చిస్తామన్నారు.
కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి వివరించారు.
- రీజినల్ రింగ్ రోడ్ (RRR)
- హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ
- హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్
- ఫ్యూచర్ సిటీ–బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే
- జాతీయ రహదారి NH-167 అభివృద్ధి
- కరీంనగర్–వరంగల్ హైవే
- HAM పద్ధతిలో గ్రామీణ రహదారుల నిర్మాణం
ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పారిశ్రామిక రంగం విస్తరించేందుకు మార్గం సుగమమవుతుందని మంత్రి అన్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని, రవాణా సులభతరం అవుతుందని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రోడ్ల అభివృద్ధితో రైతులకు, పరిశ్రమలకు ప్రయోజనం
మంచి రహదారులు ఉంటేనే రైతులు తమ పంటలను వేగంగా మార్కెట్లకు తరలించగలుగుతారని, పరిశ్రమలు తమ ఉత్పత్తులను సులభంగా రవాణా చేయగలుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతుందని పేర్కొంటూ, 2025–26లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యానికి రహదారులే పునాది
తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే రోడ్లు, జాతీయ రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తున్నామని అన్నారు.
85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాల ద్వారా దేశవిదేశాల నిపుణుల అనుభవం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణకు ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన కనెక్టివిటీతోనే పెట్టుబడులు పెరిగి, కొత్త పరిశ్రమలు ఏర్పడి, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.





