తాండూరు, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:
పెన్షన్ అనేది కేవలం నెలవారీ ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు కల్పించే సామాజిక భరోసా అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో తాండూరు పట్టణానికి చెందిన దాదాపు 1,100 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ నెల 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజున అర్హులైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కానుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మీ సేవ, మండల, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు అందని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే వెళ్లి నియోజకవర్గంలో దాదాపు 5 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తాండూరు పట్టణ అభివృద్ధిపై మాట్లాడుతూ.. కాగ్నా నది నుంచి పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. చిలుక వాగు, గొల్ల చెరువు అభివృద్ధితో పాటు హైదరాబాద్ రోడ్డు, అంతర్గత డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామని వివరించారు. మహిళల సంక్షేమానికి ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను అమలు చేస్తూ దశలవారీగా హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. పెన్షన్ల మంజూరు ప్రక్రియలో ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంకా పెన్షన్ పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారు, ఆదరించే వారు లేని నిరుపేదలు ఇబ్బందులు పడకూడదన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనిత, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాకేష్, ఎంఆర్ఓ తారాసింగ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





