ఖమ్మం, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రైతులు తమ భూమిలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈరోజు సోమవారం సత్తుపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చల్లగుళ్ళ నరసింహారావు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, ప్రసంగించారు. రైతన్నలకు తెలిసినంతగా శాస్త్రవేత్తలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు వ్యవసాయం గురించి తెలియదని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని అన్నదాతలు నష్టాలు రాకుండా పంటలు సాగు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొక్కజొన్న, శనగలు, జొన్నలు, సోయా, సన్‌ఫ్లవర్, ధాన్యం వంటి పంటలకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. అన్నదాతలు తమ పంటలను జాగ్రత్తగా విక్రయించుకోవాలని సూచించారు.
సత్తుపల్లికి గోదావరి జలాలను తీసుకువస్తా..
సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా సాగునీరు అందించగలిగామని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. సత్తుపల్లికి ఏ ప్రాజెక్టు అడిగినా తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గానికి ఫుడ్ పార్క్, పామాయిల్ ఫ్యాక్టరీ, కిన్నెరసాని టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తానని మాటిచ్చారు. బేతుపల్లి కాలువ ద్వారా వేంసూరు ప్రాంతంలోని చెరువులకు గోదావరి జలాలను అందించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అవసరమైతే అంగార ప్రాంతానికి కూడా గోదావరి నీటిని తీసుకువస్తానని అన్నారు. సీతారామసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడం తన రాజకీయ జీవిత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాకు విమానాశ్రయం, భద్రాద్రికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్నది తన సంకల్పమని తెలిపారు. సత్తుపల్లి మీదుగా కొవ్వూరు, పెనుబల్లి మీదుగా కొండపల్లి రైల్వేమార్గాల కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని సత్తుపల్లికి తీసుకువస్తా..
మార్కెట్ కమిటీ నిధులను తిరిగి ఆయా మార్కెట్లే ఖర్చు చేసుకునే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల భరోసా కల్పించారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, సౌకర్యాలు కల్పించే బాధ్యత తనదని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సత్తుపల్లికి తీసుకువస్తానని మాటిచ్చారు. సీఎం చేతుల మీదుగా కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. అశ్వారావుపేటకు మంజూరైన పామాయిల్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే మట్టా రాగమయి విజ్ఞప్తితో కల్లూరు గూడెనికి మార్చామని స్పష్టం చేశారు. కల్లూరు గూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ రావడంతో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు ప్రారంభమైందని ప్రస్తావించారు. మరో 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పామాయిల్‌తో పాటు కోకో, మకాడమియా, వక్క, మిరియం వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతన్నలు దృష్టి సారించాలని సూచించారు. సత్తుపల్లి ప్రాంతంలో అధిక దిగుబడులు ఇచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అన్నారు. సత్తుపల్లి మార్కెట్ కమిటీకి అవసరమైన ఏ సౌకర్యమైనా కల్పించే బాధ్యత తనదని చెప్పారు. ఖమ్మం మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సత్తుపల్లి మార్కెట్ కమిటీని కూడా అభివృద్ధి చేసి అన్నదాతలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.





