విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించి మెస్‌లు ప్రారంభించాలని డిమాండ్ నాన్ బోర్డర్ల తొలగింపునకే చర్యలు చేపట్టామన్న పోలీసులు
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:
ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ1, ఈ2, డీ హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం పరిపాలన భవనం ఎదుట మౌన దీక్ష చేపట్టారు. సుమారు పది రోజులుగా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మెస్‌లను తిరిగి ప్రారంభించాలని, భవనాలను కూల్చివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
విద్యార్థుల నిరసనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ సంఘీభావం ప్రకటించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల మధ్య హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వారు కోరుతున్నది విలాసవంతమైన సౌకర్యాలు కాదని, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులేనని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఓయూకు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి ఏడాది కావస్తున్నా నిధులు విడుదల కాలేదని అశోక్ విమర్శించారు. యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు.
మరోవైపు ఓయూ ఏసీపీ జగన్ మాట్లాడుతూ.. అధికారికంగా గుర్తింపు పొందిన బోర్డర్లకు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అనుమతి ఉందన్నారు. వాచ్‌మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆటో, ఓలా, ఉబర్ డ్రైవర్లు తదితర నాన్ బోర్డర్లు హాస్టళ్లలో ఉంటున్నారనే ఫిర్యాదులతో వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పలుమార్లు హెచ్చరించినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా నిరసనకారులను అదుపులోకి తీసుకుని అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
నిరసనలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, సతీష్, ప్రదీప్, రమేష్, శ్రీశైలం, చరణ్, శ్రీనివాసరెడ్డి, అఫ్రిది తదితరులు పాల్గొన్నారు.







