ఓయూ సభలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి డిమాండ్ పోడు భూములకు పట్టాలు.. సింగరేణి ప్రభావిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వినతి
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:
ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, ప్రత్యేక గ్రూపుగా గుర్తించి రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించిన ‘హలో నేతకాని.. చలో ఉస్మానియా’ సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ చైర్మన్ జాడి ముసలయ్య, కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనంతరం కూడా నేతకాని యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల రోస్టర్ పాయింట్లలో ఈ వర్గానికి అవకాశాలు దక్కడం లేదని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే విద్యావంతులుగా ఎదుగుతున్న యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న నేతకాని కుటుంబాల ఆవేదనను నిర్లక్ష్యం చేయవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి, ప్రత్యేక గుర్తింపుతోపాటు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం నేతకాని సమాజానికి పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక నేతకాని కుటుంబాలు పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. భూములకు పట్టాలు లేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. సింగరేణి విస్తరణతో ప్రభావితమవుతున్న కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






