హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
పేదలు, సొంత ఇల్లు లేని ఆటో, ప్రైవేట్ రవాణా డ్రైవర్లకు ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. ప్రభుత్వం విడుదల చేయనున్న క్యూర్ జీవో మార్గదర్శకాల్లో అర్హులైన డ్రైవర్లకు న్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించాలని కోరింది.
బీఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి శుక్రవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. నిజంగా ఇల్లు లేని నిరుపేద డ్రైవర్లను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకుల బినామీలు, అనర్హులు లబ్ధి పొందకుండా పటిష్ఠమైన ఎంపిక విధానం అమలు చేయాలన్నారు. పారదర్శకంగా కేటాయింపులు జరిగితే స్వాగతిస్తామని, రాజకీయ జోక్యం, అక్రమాలు చోటుచేసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లతోపాటు టాక్సీ, క్యాబ్, లారీ, గూడ్స్ క్యారియర్, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకూ లబ్ధి చేకూరేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆత్మహత్యలతో ఇంటి పెద్దను కోల్పోయి, సొంత ఇల్లు లేని కుటుంబాలకు మానవతా దృక్పథంతో ఉచితంగా ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
నిరుపేద డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని రవిశంకర్ అల్లూరి కోరారు.





