హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, సంక్షేమ నిధులను ఇతర రంగాలకు మళ్లించవద్దని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చెట్టుకింది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశం, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు అందించడంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ అధికారుల ద్వారానే నేరుగా లబ్ధి చేకూర్చాలని కోరారు.
55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని, వివాహ సహాయం రూ.లక్ష, ప్రసూతి సహాయం రూ.50 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ నిధులతో చేపడుతున్న హెల్త్ చెకప్‌లను రద్దు చేసి, ఆ మొత్తాలను కార్మికుల సంక్షేమ ప్రయోజనాలకు కేటాయించాలని కోరారు. బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు కాశయ్య, శ్రీనివాస్, గణేష్, వెంకటేష్, నరసింహ, లోకేష్, రవీందర్, నాగరాజ్, లింగస్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.





