రూ.1,000 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఈ1, ఈ2, డీ హాస్టళ్లకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హాస్టళ్ల నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించి, భవనం ఎదుట బైఠాయించారు. వెంటనే సరఫరాలను పునరుద్ధరించి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న పలువురు విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ మాట్లాడుతూ.. గత 15 రోజులుగా హాస్టళ్లలో నీరు, విద్యుత్ సమస్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తాజాగా డీఎస్ పైప్‌లైన్‌ను కూడా తొలగించారని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలను నిలిపివేసి విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలను సహించబోమన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులను అడ్డుకోవడం, కేసుల పేరుతో భయపెట్టడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ.. ఎంతోమందిని ఉన్నత స్థానాలకు చేర్చిన చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు కనీస సదుపాయాలు లేకపోవడం అన్యాయమన్నారు. ఓయూకు రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి ఏడాది కావస్తున్నా నిధులు విడుదల కాలేదని విమర్శించారు. ఆ నిధులతో హాస్టళ్లు, ప్రయోగశాలలు నిర్మించడంతోపాటు విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో భీమ్‌రావు, సురేష్, కార్తీక్, హరీష్, ప్రసాద్, వంశీ, సతీష్, అశోక్, ప్రదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





