హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ముందుకొచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన భారత్ సమ్మిట్–2026 సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, నూతన పరిశ్రమల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపార కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. టర్కీ, కెనడా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికాకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ అనుబంధ సేవలు, ఖనిజాలు, టెలికమ్యూనికేషన్స్, మొబైల్ తయారీ, ఇంజినీరింగ్, పట్టణ రవాణా, బ్యాటరీ సెల్ సాంకేతికత, ఇంధన నిల్వ తదితర రంగాల్లో అవకాశాలపై చర్చలు జరిగాయి. వాణిజ్య సదుపాయాలు, సరఫరా వ్యవస్థలు, ఔషధ తయారీ, వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి రంగాల్లో పెట్టుబడుల సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
పటిష్ఠమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పెట్టుబడులకు అనుకూల విధానాలు తెలంగాణ బలాలని శ్రీధర్‌బాబు వివరించారు. అధునాతన తయారీ, ఔషధాలు, స్వచ్ఛ ఇంధనం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కంపెనీలు కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుత కార్యకలాపాలను విస్తరించాలని కోరారు.
పెట్టుబడులను పరిశ్రమలుగా, పరిశ్రమలను ఉపాధి అవకాశాలుగా మలచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తామని చెప్పారు.
సమావేశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.





