# ఓయూలో దివ్యాంగుల హక్కులను అమలు చేయాలి
### ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
### పెండింగ్ బ్యాక్‌లాగ్ పోస్టులను ప్రత్యేక నియామకాల ద్వారా భర్తీ చేయాలి
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దివ్యాంగులకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఫోరం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి వైస్ ఛాన్సలర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీసీకి వినతిపత్రం సమర్పించారు.
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 ప్రకారం విశ్వవిద్యాలయంలో చేపట్టే ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని నాయకులు కోరారు. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను గుర్తించి ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయడంతో పాటు ఇప్పటివరకు భర్తీ చేసిన పోస్టులు, మిగిలిన ఖాళీల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయరాదని పేర్కొన్నారు.
దివ్యాంగులకు జాలి చూపించడం కాకుండా రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్, మారవేణి చంద్రశేఖర్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.






