# గ్రంథాలయాల ప్రాముఖ్యతను చాటిన కవి సమ్మేళనం
### 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో 17 మంది కవుల కవితా గానం
### పుస్తక పఠనంపై యువతలో ఆసక్తి పెంచాలి: వక్తలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: 59వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని చిక్కడపల్లిలోని శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయంలో కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనం విలువ అనే అంశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో 17 మంది కవులు పాల్గొని తమ కవితా గానంతో ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. అలివేణి హాజరయ్యారు. గ్రేడ్-1 లైబ్రేరియన్ ఎల్. చంద్రకళ, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తంగెళ్లపల్లి కనకాచారి కవి సమ్మేళనాన్ని నిర్వహించారు.
కవి సమ్మేళనంలో జర్నలిస్టు జయసూర్య, చామర్తి వాణిశ్వర శాస్త్రి, బొల్లిముంత వెంకటరమణ, విజయభారతి, పొన్నాల బాలయ్య, సలీమా, మిద్దె సురేష్, డాక్టర్ కృష్ణప్రసాద్, పరిమి వెంకట సత్యమూర్తి, డాక్టర్ చిదెళ్ల సీతాలక్ష్మి, కాసర్ల సరోజాదేవి, సారధి రమేష్, అనంతుల రాజేశ్వరి, శోభా దేశ్‌పాండే తదితరులు కవితా పఠనం చేశారు. అనంతరం కవులందరినీ నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సముపార్జనకు నిలయాలని, విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రంథాలయ ఉద్యమ చరిత్రను వివరించి, ప్రజల్లో పుస్తకాలపై మక్కువ పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా బుధవారం పాఠశాల విద్యార్థులకు స్లోగన్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు స్ఫూర్తిదాయక గీతాలను ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు.





