బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు
* ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ
* చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు
* జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 : మహిళను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన టి. యాదమ్మ (51) ఈ నెల 21న మెట్టుగూడ సమీపంలోని కల్లు దుకాణానికి వెళ్లింది. అక్కడ సాయి అనే వ్యక్తి పరిచయమై ఆమెను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి తన ఆక్టివా వాహనంపై తీసుకెళ్లాడు. అనంతరం అలుగడ్డబావి మహంకాళి దేవాలయం సమీపంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఈ క్రమంలో యాదమ్మ మత్తులో నిద్రపోగా, కొంతసేపటి తర్వాత మేల్కొని చూడగా మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. సదరు వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలగూడ కింది బస్తీకి చెందిన పాల వ్యాపారి పి. సాయికుమార్ (40)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ కె. రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ జె. నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి మార్గదర్శకత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎస్. సైదాబాబు పర్యవేక్షణలో క్రైమ్ సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రజల ఆస్తుల పరిరక్షణకు, నేరాల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.





