గాడి తప్పిన పరిపాలన జీహెచ్ఎంసీ ఇష్టారాజ్యంగా సరెండర్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 20: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులతోపాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు కార్పొరేషన్లలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో పరిపాలన గాడి తప్పుతుందన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల విధి నిర్వహణ కేవలం సమావేశాలు, సమీక్షలు, ఆదేశాల జారీకే అమలవుతుందన్న వాదనలున్నాయి. ఏకంగా బల్దియా బాసు ఆదేశాలే అమలుకు నోచుకోవడం లేదంటే, ఇక సామాన్యుడి వినతులు, అభ్యర్థనలు, అర్జీల పరిస్థితి ఏంటో అంచనా వేసుకోవచ్చు. గడిచిన రెండేళ్ల నుంచి జీహెచ్ఎంసీ వరుసగా అక్రమాలు, అవకతవకలు, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నా, వాటిపై కేవలం విచారణలకు ఆదేశించిన కమిషనర్ నివేదికలు, నివేదికల్లో బాధ్యులైన అధికారులు, సిబ్బంది వివరాలను విజిలెన్స్ స్పష్టంగా పేర్కొన్నా, వారిపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లిస్తూ మొత్తం రూ.136 కోట్ల నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించిన వ్యవహారం వెలుగుచూసినా, బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ ఆ విభాగాధిపతిని కేవలం మాతృశాఖకు సరెండర్ చేయడం కూడా హాట్ టాపిక్ మారింది.
జోనల్ స్థాయిలో పరిమిత సంఖ్యలోని సర్కిళ్లలో పరిపాలన, అభివృద్ధి, పౌర సేవల నిర్వహణ వంటివి పర్యవేక్షిస్తున్న జోనల్ కమిషనర్ల ఆదేశాలకు కూడా దిక్కూ దివానం లేదు. సర్కిళ్లలో పరిపాలన మరింత దారుణంగా తయారైనట్టు కొందరు జీహెచ్ఎంసీ సిబ్బందే బాహాటంగా చెబుతున్నారు. ముఖ్యంగా గోల్కొండ జోన్‌లోని ఆడిట్ సెక్షన్లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యూనియన్ నేతను జూలై 13వ తేదీన అదే జోన్‌లోని గోషామహాల్ సర్కిల్‌కు బదిలీ చేస్తూ జోనల్ కమిషనర్ ఉదయ్ కుమార్ లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేసినా నేటికీ అమలు కావడం లేదు. సదరు యూనియన్ నేత, సూపరింటెండెంట్ నేటికీ గోల్కొండ జోన్ ఆడిట్ సెక్షన్లోనే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఎంఎంసీలో ఇష్టారాజ్యంగా సరెండర్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హయత్ నగర్ సర్కిల్లో విధులు నిర్వర్తించే ఓ సీనియర్ అసిస్టెంట్‌ను ఎలాంటి కారణాలు లేకుండానే జీహెచ్ఎంసీకి సరెండర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంతో పాటు సైబరాబాద్, జీహెచ్ఎంసీ సర్కిళ్లలో జరుగుతున్న అనధికారిక బదిలీలు, సరెండర్లు, బదిలీలైనా సీట్లు వదలకపోవడం వంటి వ్యవహారాలపై బుధవారం ఓ యూనియన్ స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.





