కొండారెడ్డిపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. గజమాలతో సీఎంను గ్రామస్తులు సత్కరించారు. అనంతరం సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. సాయంత్రం వేళ మైసమ్మ ఆలయంలో పూజలతో పాటు సంప్రదాయ జమ్మి చెట్టు పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను నేరుగా కలిసి మాట్లాడారు. కాగా మొదటి నుంచీ దసరా వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో జరుపుకోవడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి రాకతో కొండరెడ్డిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.










