దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదని గుర్తు చేశారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీది అన్నారు.
మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే అని తెలిపారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం అని సీఎం వివరించారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని చెప్పారు. దళితులు, గిరిజనులు,ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని, బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. చదువొక్కటే జీవితాలను మారుస్తుందని, అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదు. పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించండి సీఎం సూచించారు. ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పనిచేస్తుందని , రాజకీయలకు అతీతంగా అందరూ అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ చైర్మన్లు, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




