జాతీయ కరాటే పోటీల్లో ఆలేరు విద్యార్థుల సత్తా
పతకాలు సాధించిన కరాటే విజేతలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఘన సన్మానం
కరాటే మాస్టర్ దర్శనం క్రాంతి కృషిని అభినందించిన ఎమ్మెల్యే
ఆలేరు, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో నిర్వహించిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. కరాటే మాస్టర్ దర్శనం క్రాంతి శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటి ఆలేరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చారు.
ఈ పోటీల్లో బి. భావన, జోయల్ రాజ్, సమీర్, అభిరామ్ రెడ్డి బంగారు పతకాలు సాధించగా, తేజపాల్ రెడ్డి రజత పతకం, హన్నికా ప్రిన్సీ, ఆదిత్య శరణ్ కాంస్య పతకాలు సాధించారు.
విజేతలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేకంగా అభినందించి, బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చాటి పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఆలేరు నియోజకవర్గానికి, యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందించి జాతీయ స్థాయిలో విజేతలుగా తీర్చిదిద్దిన కరాటే మాస్టర్ దర్శనం క్రాంతిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బిజనీ బాలమణి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్, కుల్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.





