సదస్సు విజయవంతానికి తెలుగు సినీ పరిశ్రమ సంపూర్ణ సహకారం
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:
తెలంగాణ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ స్టూడియోలతో అనుసంధానించే లక్ష్యంతో ఇండియాజాయ్–2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఇండియాజాయ్ సినీ రంగ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, సృజనాత్మక రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏవీజీసీ విధానం, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సృజనాత్మక పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వివరించారు. రానున్న సదస్సులో ఇండియాజాయ్‌ను విస్తృత స్థాయిలో నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రణాళికను వెల్లడించారు.
టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. సదస్సు విజయవంతానికి సినీ పరిశ్రమ పెద్దఎత్తున భాగస్వామ్యమవుతుందని తెలిపారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ, సినీ, సృజనాత్మక రంగాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి స్వాగతించదగినదన్నారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్.ఆదిత్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి తదితరులు ఇండియాజాయ్‌కు మద్దతు ప్రకటించారు. దర్శకులు హరీశ్‌శంకర్, సాయిరాజేశ్, నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాల ప్రతినిధులు ఆధునిక చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రపంచ పెట్టుబడిదారులతో అనుసంధానం
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియాజాయ్‌ను పదిరెట్ల విస్తృతితో నిర్వహించాలన్న లక్ష్యాన్ని వివరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి విజయాలతో హైదరాబాద్‌పై అంతర్జాతీయ దృష్టి పెరిగిందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలని కోరారు.
డిసెంబర్ 7 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా 15 ఎకరాల విస్తీర్ణంలో ఇండియాజాయ్ నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా సందర్శకులు, పాల్గొనేవారు, 200కుపైగా ప్రదర్శనదారులు, 100కుపైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులను సమీకరించాలని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీనెగ్, ఈఏ స్పోర్ట్స్, ఉబిసాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి సంస్థల భాగస్వామ్యాన్ని ప్రతిపాదించారు.
ఒకే వేదికపై 15కుపైగా కార్యక్రమాలు
వీఎఫ్‌ఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ సహా 15కుపైగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న రెడ్ కార్పెట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డిసెంబర్ 9న ఆస్కార్ విజేత, పద్మశ్రీ ఎం.ఎం.కీరవాణి చేతుల మీదుగా కాన్సర్ట్ అరేనా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.





