హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ వెల్లడించారు. పెన్షన్ల విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ ఆదివారం హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆధారాలతో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ వీణవంక మండలంలో కౌశిక్‌రెడ్డి సొంత గ్రామంలోనే 28 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా 1,980 వితంతు, 1,133 దివ్యాంగ, 553 గీత కార్మిక, 145 చేనేత కార్మిక, 311 ఒంటరి మహిళల పెన్షన్లు అందించినట్లు వివరించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ పెన్షన్లు మంజూరయ్యాయని, ఇప్పుడు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని, నియోజకవర్గంలో 33,158 మంది రైతులకు రూ.248.5 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రణవ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో ఆధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న కౌశిక్‌రెడ్డి తన మాటకు కట్టుబడి ఉండాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.





