తార్నాకలో బీజేపీ నాయకుల ముందస్తు గృహనిర్బంధం
సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:
భారత్ సమ్మిట్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేవైఎం నిరసనలకు పిలుపునివ్వడంతో తార్నాకలో ఆమెతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. హామీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని తాము భావిస్తున్న శక్తులకు భారత్ సమ్మిట్‌లో చోటు కల్పించడాన్ని ఆమె తప్పుబట్టారు. గిగ్ వర్కర్ల సంక్షేమ ప్రతిపాదనలు ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చాలని సూచించారు.
గృహనిర్బంధానికి గురైన వారిలో వీరన్న, సంపత్, టెంపుల్ సాయి, కృష్ణ, కిరణ్, చరణ్‌రాజ్, తరుణ్, కేదార్ తదితరులు ఉన్నారు.





