తెలంగాణ మహిళల ఎమర్జింగ్ స్టార్స్ టీ20 టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమ్–ఏ
ఫైనల్లో టీమ్–బీపై 48 పరుగుల తేడాతో ఘన విజయం
అర్ధ సెంచరీలతో రాణించిన క్షేత్ర, అక్షయ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా క్షేత్ర
విజేతలకు బహుమతులు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 21: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ మహిళల ఎమర్జింగ్ స్టార్స్ టీ20 క్రికెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన ఫైనల్ పోరులో టీమ్–ఏ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని వీజేఆర్ మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్–బీపై 48 పరుగుల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది.
ముందుగా టాస్ గెలిచిన టీమ్–బీ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమ్–ఏ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జట్టులో క్షేత్ర 39 బంతుల్లో 52 పరుగులు చేయగా, అక్షయ 43 బంతుల్లో 54 పరుగులతో అద్భుతంగా రాణించారు. వీరిద్దరి అర్ధ సెంచరీలతో టీమ్–ఏ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్–బీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్–ఏ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన క్షేత్రను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు.
అనంతరం నిర్వహించిన ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) అధ్యక్షుడు వి. ఆగం రావు, ఉపాధ్యక్షులు కె. మహేందర్ గౌడ్, మురళీధర్ రావు, కోశాధికారి బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, ఆర్. విద్యాసాగర్ రావు, సి. అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






