బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించి తెలంగాణ సత్తా చాటుదాం-మంత్రి వాకిటి శ్రీహరి ఖేలో ఇండియా నిర్వహణకు రూ.203.36

Sai Rapoluమంగళవారం, 17 నవంబర్ 2026 · 10:41 AM10 వీక్షణలుtrinetnews.com
తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి

*తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి*

*ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించి తెలంగాణ సత్తా చాటుదాం-మంత్రి వాకిటి శ్రీహరి*

*ఖేలో ఇండియా నిర్వహణకు రూ.203.36 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు-మంత్రి వాకిటి శ్రీహరి*

*రాబోయే 20 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి-మంత్రి వాకిటి శ్రీహరి*

*ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా క్రీడా రంగానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం-మంత్రి వాకిటి శ్రీహరి*

*తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రధాన వేదికగా తీర్చిదిద్దుతాం-మంత్రి వాకిటి శ్రీహరి*

*ఖేలో ఇండియా నిర్వహణలో ప్రముఖ క్రీడాకారులు, మాజీ అంతర్జాతీయ క్రీడాకారుల భాగస్వామ్యం తప్పనిసరి-మంత్రి వాకిటి శ్రీహరి*

*ప్రతి క్రీడా వేదికను దత్తత తీసుకుని పర్యవేక్షించేలా ప్రముఖ క్రీడాకారులకు బాధ్యతలు అప్పగించే ఆలోచన-మంత్రి వాకిటి శ్రీహరి*

*డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం-మంత్రి వాకిటి శ్రీహరి*

*దేశవ్యాప్తంగా వచ్చే వేలాది మంది క్రీడాకారులకు అత్యుత్తమ ఆతిథ్యం, వసతులు కల్పిస్తాం-మంత్రి వాకిటి శ్రీహరి*

*గ్రామీణ, గురుకుల విద్యార్థులను క్రీడా పోటీలకు తీసుకొచ్చి వారిలో క్రీడా స్ఫూర్తి నింపుతాం-మంత్రి వాకిటి శ్రీహరి*

*ఖేలో ఇండియా విజయంతో భవిష్యత్తులో క్రీడా రంగానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించే దిశగా కృషి చేస్తాం-మంత్రి వాకిటి శ్రీహరి*

*క్రీడా వేదికల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం.. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు-మంత్రి వాకిటి శ్రీహరి*

*క్రీడాకారుల సూచనలను స్వీకరించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం-మంత్రి వాకిటి శ్రీహరి*

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోందని పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంశాలపై ప్రముఖ క్రీడా ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులు జె.జె. శోభ, నీతా ఎల్. దాడ్వే, ఇస్మాయిల్ బేగ్, ఈషా సింగ్, అంబటి తిరుపతి రాయుడు, అగసర నందిని, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు తీసుకురావడం ఒక గొప్ప అవకాశమైతే, వాటిని దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించడం అంతకంటే పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఏడు ఎడిషన్లలో జరిగిన క్రీడా పోటీలకంటే మెరుగైన ప్రమాణాలతో ఎనిమిదో ఎడిషన్‌ను నిర్వహించి తెలంగాణ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం-మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ క్రీడా పటంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మంత్రి శ్రీహరి తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను ఇందుకు ఒక గొప్ప అవకాశంగా ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.

తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు ఎదగాలని, ప్రతి జిల్లాలో అత్యుత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాలు సాధించే క్రీడాకారులకు తెలంగాణ కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలను కేవలం పోటీలకే పరిమితం చేయకుండా యువత జీవన విధానంలో భాగంగా మార్చాలని, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని వివరించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా క్రీడా రంగానికి పెట్టుబడులు*

ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర క్రీడా రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులనుఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు, క్రీడా పరికరాలు, స్పోర్ట్స్ సైన్స్, ఇతర అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వివరించారు.

తెలంగాణలో క్రీడా రంగాన్ని కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు.

రూ.203.36 కోట్లతో అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.203.36 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. ఈ నిధులను కేవలం తాత్కాలిక ఏర్పాట్ల కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002–2003లో అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం నిర్మించిన మౌలిక సదుపాయాలను ఇప్పటికీ వినియోగిస్తున్నామని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న స్టేడియాలు, గ్రౌండ్లు, ట్రాక్‌లు, ఇతర క్రీడా సదుపాయాలు రాబోయే 15 నుంచి 20 ఏళ్లపాటు తెలంగాణ క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంతో పాటు ఇతర క్రీడా వేదికలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

క్రీడాకారుల భాగస్వామ్యంతోనే విజయవంతమైన నిర్వహణ*

ఖేలో ఇండియా నిర్వహణలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన క్రీడాకారుల భాగస్వామ్యం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. తాను కూడా గతంలో క్రీడాకారుడినేనని, అందువల్ల క్రీడాకారుల అవసరాలు, సమస్యలు తనకు తెలుసని చెప్పారు. క్రీడాకారులు ఇచ్చే ప్రతి సూచనను గౌరవించి, ఆచరణ సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రముఖ క్రీడాకారులకు ఒక్కో క్రీడా వేదిక బాధ్యత అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల్లో చేరి ప్రస్తుతం శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లను ఆయా క్రీడలకు నోడల్ అధికారులుగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రతి చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయొద్దు*

క్రీడా పోటీల నిర్వహణలో చిన్నపాటి సమస్య కూడా రాష్ట్ర ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. క్రీడాకారులకు వసతి, నాణ్యమైన ఆహారం, తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, రవాణా, క్రీడా పరికరాలు, గ్రౌండ్లు, ట్రాక్‌లు తదితర అన్ని సదుపాయాలు అత్యుత్తమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

తాను స్వయంగా క్రీడా వేదికలను సందర్శిస్తూ నిర్మాణ పనులను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లు, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా మంత్రులు, కలెక్టర్లకు బాధ్యతలు*

హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా పోటీలకు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి క్రీడా వేదిక వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ఏ ఒక్క మంత్రి లేదా అధికారికి సంబంధించినది కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించినదని స్పష్టం చేశారు. అందరూ ఒకే జట్టుగా పనిచేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

*తెలంగాణలో క్రీడా పండుగ వాతావరణం*

డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పండుగ వాతావరణం నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. క్రీడా పోటీలకు సుమారు 7 నుంచి 8 వేల మంది క్రీడాకారులతో పాటు కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది, ఇతర ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు తెలంగాణ ఆతిథ్యం చిరస్మరణీయంగా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

క్రీడల నిర్వహణలో కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రముఖ క్రీడాకారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపుతాం

గ్రామీణ ప్రాంతాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను ప్రత్యేక బస్సుల ద్వారా క్రీడా వేదికలకు తీసుకువచ్చి పోటీలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల ఆటతీరును ప్రత్యక్షంగా చూసినప్పుడు గ్రామీణ విద్యార్థుల్లో కూడా తాము గొప్ప క్రీడాకారులుగా ఎదగాలనే పట్టుదల పెరుగుతుందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఖేలో ఇండియా ఒక గొప్ప వేదికగా మారాలని ఆకాంక్షించారు.

తెలంగాణపై అంతర్జాతీయ మీడియా దృష్టి పడాలి-వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా తెలంగాణ క్రీడా సామర్థ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ప్రముఖ క్రీడాకారులు, క్రీడా దిగ్గజాలు, ఇతర ప్రముఖులను భాగస్వాములను చేయడం ద్వారా క్రీడలపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచాలని భావిస్తున్నామని తెలిపారు.

కొన్ని రాష్ట్రాలు క్రీడా రంగంలో తెలంగాణకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని, వాటితో పోటీపడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ, క్రీడాకారుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ క్రీడాకారుల ద్వారా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని, రాష్ట్రంలోని యువతను క్రీడల వైపు ఆకర్షించాలని సూచించారు.

ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ క్రీడా రంగం

ఖేలో ఇండియా నిర్వహణ కేవలం ఒక క్రీడా కార్యక్రమానికి పరిమితం కాకూడదని, భవిష్యత్తులో ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేసే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని మంత్రి తెలిపారు. సంవత్సరంలో నాలుగు సీజన్లలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం, నిరంతర శిక్షణ, పోటీల ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

రాష్ట్రంలో క్రీడా రంగానికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిందని చెప్పారు.

ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో క్రీడా శాఖకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

క్రీడాకారుల సూచనల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్

ఖేలో ఇండియా ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇందులో ప్రముఖ క్రీడాకారులను కూడా చేర్చి వారి సూచనలు స్వీకరించాలని అధికారులకు సూచించారు. క్రీడా వేదికల్లో ఎదురయ్యే సమస్యలు, అవసరమైన మార్పులు, మెరుగైన నిర్వహణకు సంబంధించిన సూచనలను ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. ఆ సూచనలను పరిశీలించి ఆచరణ సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

*క్రీడాకారుల సూచనలకంటే భాగస్వామ్యమే ముఖ్యం-మంత్రి శ్రీహరి*

ప్రముఖ క్రీడాకారులు కేవలం సూచనలు ఇవ్వడానికే పరిమితం కాకుండా క్రీడా వేదికలకు వచ్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. “మీరు ఒక క్రీడా వేదికకు వచ్చి కూర్చున్నా అక్కడి వాతావరణమే మారిపోతుంది. మీ సమక్షం యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ అనుభవం, మీ సూచనలు, మీ భాగస్వామ్యం తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.

ప్రముఖ క్రీడాకారులకు ప్రత్యేక సమయ పట్టిక రూపొందించి ఆయా క్రీడా వేదికల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

“ఖేలో ఇండియా విజయమే తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు పునాది-మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి, భవిష్యత్తులో ఏ జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా పోటీలైనా నిర్వహించగల సామర్థ్యం తెలంగాణకు ఉందనే నమ్మకాన్ని దేశవ్యాప్తంగా కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

‘‘ఇది కేవలం క్రీడా పోటీల నిర్వహణ కాదు. తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. మనమందరం ఒకే జట్టుగా పనిచేసి దేశంలోనే అత్యుత్తమ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిర్వహిద్దాం. తెలంగాణను దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం’’ అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →