మహిళా క్రికెట్ ప్రతిభకు హెచ్‌సీఏ ప్రోత్సాహం
120 మంది క్రీడాకారిణులతో ఎనిమిది జట్లు
కరీంనగర్, సిద్దిపేటలో 32 పోటీ మ్యాచ్‌లు
కరీంనగర్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: తెలంగాణవ్యాప్తంగా ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను గుర్తించి, మెరుగైన శిక్షణతో ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చేపట్టిన రాష్ట్ర మహిళల క్రికెట్ అభివృద్ధి కార్యక్రమం పోటీ మ్యాచ్‌ల దశకు చేరుకుంది. ఇందులో భాగంగా 12 రోజుల శిక్షణ, ప్రాక్టీస్ మ్యాచ్‌ల కార్యక్రమం కరీంనగర్‌లోని వెల్చాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంపిక ట్రయల్స్‌లో 500 మందికి పైగా మహిళా క్రికెట్ అభ్యర్థులను పరిశీలించారు. వారిలో జిల్లాల నుంచి 100 మందిని, హైదరాబాద్ నగరం నుంచి 100 మందిని ఎంపిక చేసి కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ప్రత్యేక కోచింగ్, శిక్షణ అందించారు.
శిక్షణ అనంతరం జిల్లాల నుంచి 60 మంది, హైదరాబాద్ నుంచి 60 మంది చొప్పున మొత్తం 120 మందిని తుది ఎంపిక చేశారు. వీరిని ఒక్కో జట్టులో 15 మంది చొప్పున ఎనిమిది జట్లుగా విభజించారు. ఈ జట్లు కరీంనగర్, సిద్దిపేటలో మొత్తం 32 పోటీ మ్యాచ్‌లలో పాల్గొననున్నాయి. పగలు, రాత్రి నిర్వహించే మ్యాచ్‌ల ద్వారా క్రీడాకారిణులకు విభిన్న పరిస్థితుల్లో ఆడే అనుభవం లభించనుంది.
హెచ్‌సీఏ మహిళల క్రికెట్ కమిటీ అధ్యక్షురాలు సునీత ఆనంద్ నాయకత్వంలో కార్యక్రమం కొనసాగుతోంది. క్రీడాకారిణులకు అర్హత కలిగిన కోచ్‌లు, సహాయ కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, ఫిట్‌నెస్ నిపుణుల సేవలతోపాటు అవసరమైన శిక్షణ పరికరాలు, మైదానాలు, మౌలిక సదుపాయాలను హెచ్‌సీఏ సమకూర్చింది. జిల్లాల్లోని మహిళా క్రికెట్ ప్రతిభను వెలికితీసి, ఉన్నతస్థాయి పోటీలకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ప్రారంభోత్సవంలో కేడీసీఏ అధ్యక్షుడు వి. అగం రావు, ఉపాధ్యక్షులు మురళీధర్ రావు, మహేందర్ గౌడ్, కార్యదర్శి మనోహర్ రావు, కోశాధికారి శ్రవణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి కరుణాకర్ రావు, కార్యవర్గ సభ్యులు అజిత్ రావు, హరికిషన్, విద్యాసాగర్ పాల్గొన్నారు.









