దక్షిణ మధ్య రైల్వేలో తొలిసారిగా ‘కవచ్ 4.0’ ప్రారంభం
రైల్వే భద్రతలో మరో కీలక మైలురాయి
మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్
మరింత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు.. మెరుగైన సిగ్నల్ సమాచారం
న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:
రైల్వే భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని సాధించింది. దక్షిణ మధ్య రైల్వే (SCR)లో తొలిసారిగా ‘కవచ్ వెర్షన్ 4.0’ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి–కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర ఇప్పటికే అమల్లో ఉన్న కవచ్ వెర్షన్ 3.2ను అధునాతన వెర్షన్ 4.0కు అప్‌గ్రేడ్ చేసింది.
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని విభిన్న నిర్వహణ, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కవచ్ వెర్షన్ 4.0ను అభివృద్ధి చేసి, విస్తృతంగా పరీక్షించిన అనంతరం ప్రస్తుతం అమల్లోకి తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థగా పనిచేస్తూ రైళ్ల రాకపోకల్లో భద్రతను మరింత పెంచనుంది.
కవచ్ 4.0లో అధునాతన భద్రతా ఫీచర్లు
కొత్త వెర్షన్‌లో రైలు ఉన్న ప్రదేశాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించే సాంకేతికతను మెరుగుపరిచారు. పెద్ద రైల్వే యార్డుల్లో సిగ్నల్ సమాచారాన్ని స్పష్టంగా అందించే విధంగా వ్యవస్థను ఆధునీకరించారు. అలాగే స్టేషన్ నుంచి స్టేషన్‌కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) ఇంటర్‌ఫేస్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో నేరుగా అనుసంధానం వంటి కీలక సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఆధునిక ఫీచర్ల ద్వారా రైళ్ల కదలికలను మరింత సమర్థంగా పర్యవేక్షించడంతో పాటు సిగ్నల్ సంబంధిత సమాచారాన్ని వేగంగా, ఖచ్చితంగా అందించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైల్వే ప్రయాణ భద్రత, వ్యవస్థ విశ్వసనీయత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
భారతీయ రైల్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో కవచ్ 4.0 అమలు కీలక ముందడుగుగా నిలుస్తోంది.





