ట్రైనట్ న్యూస్ 26 ఆగస్టు
కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ద్వారకుంట సమీపంలో నిలిచి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించారు.
గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





