తెలుగు యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 10:
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు , పరిశోధకులకు , సాహిత్యాభిమానులకు ఉపయోగపడేలా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం 50 శాతం ప్రత్యేక రాయితీ తో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న తరతరాల తెలుగు జాతి మ్యూజియంలో ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు.
సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 3 వరకు కొనసాగనున్న ఈ పుస్తక ప్రదర్శన కార్యాలయ పనిదినాలలో ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుస్తకాల విక్రయం ఉంటుందని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, జానపదం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన పుస్తకాలతో పాటు వివిధ అంశాలపై పరిశోధన చేసిన ప్రముఖుల సిద్ధాంత గ్రంథాల ప్రచురణలు కూడా విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడేలా ఒకే చోట లభ్యం కానున్నాయి. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పాఠకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు , హైదరాబాద్ నగరంలోని తెలుగు సాహిత్యాభిమానులు, విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిజిస్ట్రార్ విజ్ఞప్తి చేశారు.





