హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగు–హిందీ సినీ సంగీత విభావరి ‘సీజన్–15’ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
సంస్థ నిర్వాహకుడు, గాయకుడు ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సంగీత విభావరిలో గాయని రేణుకా రమేష్ (మధుర గాన మయూఖ), గాయని, వ్యాఖ్యాత ప్రశాంతి, గాయకుడు రుద్రారెడ్డి పాల్గొన్నారు. తెలుగు, హిందీ చిత్రాల్లోని పలు మధుర గీతాలను తమదైన శైలిలో ఆలపించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
కార్యక్రమానికి సత్యసంగీత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఓంకార్ రాజు, శైలజ ఓంకార్, అంజనీ కుమారి పీవీపీ తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అలనాటి నుంచి నేటి వరకు సంగీతాభిమానుల ఆదరణ పొందిన సినీ గీతాల ఆలాపనతో కళావేదిక సంగీతమయంగా మారింది.
గాయనీ గాయకుల మధుర గానానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగు–హిందీ సినీ సంగీత మాధుర్యాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. కార్యక్రమ నిర్వాహకుడు ఆనంద్ పాల్గొన్న అతిథులు, కళాకారులు, సంగీతాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.





