15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిభావంతులకు పురస్కారాలు, సర్టిఫికేషన్లు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 7:
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (ఇంటర్నేషనల్) 15వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘టిబీఆర్ ఐకాన్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్’ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు పలువురిని ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి హైదరాబాద్ సిటీ అదనపు డీసీపీ (అడ్మిన్-సీఏఆర్) రామదాసు తేజావత్, వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా పీవీపీ అంజనీ కుమారి, ప్రత్యేక అతిథిగా కల్నల్ డా. పి. శ్రీనాగేష్ పాల్గొననున్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, చైర్మన్ డా. చింతపట్ల వెంకటాచారి, ప్రత్యేక జ్యూరీ సభ్యుడు డా. టి.వి. అశోక్ కుమార్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు టిబీఆర్ చీఫ్ కో-ఆర్డినేటర్ లక్ష్మీ శాంతి వ్యవహరించగా, కల్చరల్ వింగ్ కో-ఆర్డినేటర్ మధుసూదన్ రావు కార్యక్రమ నిర్వహణలో సహకరించనున్నారు.
ఈ సందర్భంగా చుందూరు సుజాతకు టిబీఆర్ ఐకాన్ అవార్డు, ర్యాలి సాయిరాంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, ఇందిరా శశిధర్‌కు టిబీఆర్ ఐకాన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. పేపర్ కరెన్సీ నోట్లు, నాణేల సేకరణలో ప్రత్యేక అభిరుచికి డి.ఆర్.వి. ప్రసాద్ రావు, క్రీడా రంగంలో ప్రతిభకు జలసూత్రం వెంకటరావులను సత్కరించనున్నారు.
చిన్నారుల్లో హమ్మింగ్ ట్యూన్స్ ద్వారా పాటలను గుర్తించి పాడగల ప్రతిభకు బేబీ అక్షర ద్వితి మాదిరాజు, అసాధారణ అభ్యాస నైపుణ్యాలకు ఏడు నెలల చిన్నారి మాస్టర్ విహాంత్, ఐదేళ్లలోపు వయసులో వేగవంతమైన జ్ఞాపకశక్తికి మాస్టర్ రియాన్ష్ బుర్రా ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు.
కార్యక్రమంలో భక్తిగాన శిరోమణి అనురాధ, బాల గాయని బేబీ నయన క్షేత్ర మాదిరాజు గాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమై, సాయంత్రం 6.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ–కళా వెంకట దీక్షితులు వేదికలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






