తార్నాకలో కొనసాగుతున్న ‘సేవా-25’ కార్యక్రమాలు..
* మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ స్ఫూర్తితో 25 సేవా కార్యక్రమాలకు ప్రణాళిక..
తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల నిరంతర ప్రజాసేవకు స్ఫూర్తిగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ ఇంచార్జ్ శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో తార్నాకలో చేపట్టిన ‘తార్నాక సేవా-25’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం తార్నాక డివిజన్ లో అన్నదానం, మట్టి వినాయక విగ్రహాల పంపిణీ, వినాయక మండపాలకు సహకారం, ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్ట్రీట్ నంబర్ 3లో మట్టి వినాయక విగ్రహాలను స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ రామ్ వెంకటేష్ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ 25 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పని చేస్తూ నేడు గ్లోబల్ లీడర్ గా ఎదగడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నేడు అయిదు కార్యక్రమాలను చేశామన్నారు. మండప సేవ, యువతకు అవగాహన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఇలా వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. యువతకు సామాజిక సేవ మీద అవగాహన కల్పించడం కోసం మరిన్ని కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు కుమారుడు అడ్వకేట్ అవనీష్ మాట్లాడుతూ.. సేవ అనేది ఒకరోజు కార్యక్రమం కాదని, నిరంతరం కొనసాగాల్సిన బాధ్యత అన్నారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు కంటే కరుణాకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అందరికీ స్ఫూర్తిదాయకమని, అదే స్ఫూర్తితో తార్నాకలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమాల్లో అడ్వకేట్ శ్రీనివాస్, సుబ్బారావు, కృష్ణ గౌడ్, దేవ, రాధాకృష్ణ, మోహన్, పవన్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





