కొడంగల్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:
గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను చూసి ఒకరు గడ్డం పెంచుకున్నారని, ఆయనకు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేషాలు, భాషలు మార్చినా బుద్ధి మారనంత వరకు తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం నిర్మాణం, కొడంగల్ అభివృద్ధి, ఎల్‌నినో ప్రభావంతో రానున్న కరువు పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
పదేళ్లలో పాలమూరుకు ఒరిగిందేమీ లేదు
బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేసిన సీఎం.. పాలమూరుకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ వస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఆశించి 2009లో విఠల్‌రావును కాదని కేసీఆర్‌ను ప్రజలు పార్లమెంటుకు పంపించారని పేర్కొన్నారు.
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తో పాటు మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకాలు పూర్తవుతాయని ప్రజలు ఆశించారని చెప్పారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, పాలమూరు ప్రజల సాగునీటి కల నెరవేరేదని వ్యాఖ్యానించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
కాళేశ్వరం అవినీతిపై నిలదీత
కేంద్రం జాతీయ ప్రాజెక్టు ఇస్తామని చెప్పినా పట్టించుకోకుండా ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కూలిపోయింది కూడా వారి పాలనలోనేనని అన్నారు.
కాళేశ్వరం అవకతవకలపై తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ముందు మోకరిల్లి విచారణను జాప్యం చేయాలని కోరింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు హరీశ్‌రావు తనను కాళేశ్వరరావుగా పొగిడించుకున్నారని, ఇప్పుడు మేడిగడ్డ పేరు ప్రస్తావిస్తే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ల నుంచి నీళ్లు ఎత్తాలని మాట్లాడుతున్నారని, మూడు పంపులు ఏకకాలంలో పనిచేస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుందని పేర్కొన్నారు. మేడిగడ్డ కూలిపోవడానికి కాసుల కక్కుర్తే కారణమని ఆరోపించారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొందన్నారు.
కాళేశ్వరంపై రెండు రోజుల చర్చకు అనుమతివ్వాలి
కాళేశ్వరం, గోదావరి జలాలు, ఎల్‌నినో ప్రభావంపై శాసనసభలో రెండు రోజుల పాటు చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా సభకు రావాలని, చర్చలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా సమ్మక్క సారలమ్మ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతులకు నీరందిస్తున్నామని వివరించారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు.
కొడంగల్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొడంగల్‌కు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా రైల్వే లైన్‌ను అడ్డుకున్నారని, సిమెంట్ ఫ్యాక్టరీలు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, విద్యా అవకాశాలు కల్పించలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసిందని తెలిపారు. గతంలో భూసేకరణ పరిహారం ఎకరానికి రూ.2 లక్షలు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించిందని చెప్పారు.
కొడంగల్‌ను దేశంలోనే అభివృద్ధికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు పారిశ్రామిక అభివృద్ధి విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా, రేర్ ఎడ్యుకేషన్ హబ్, రేర్ ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాండూరు పప్పును ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, మరో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా మూడేళ్లలో కొడంగల్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎల్‌నినో కరువుపై రైతులకు హెచ్చరిక
రానున్న ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రైతులను అప్రమత్తం చేశారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల మేలు కోరుతోందని, వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బావ, బామ్మర్దులు చెప్పే మాటలు విని నష్టపోవద్దని, జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేసుకోవాలని హితవు పలికారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చి ప్రజలను కలుస్తానని వెల్లడించారు. ఎల్‌నినో కరువును అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. చివరిగా కొడంగల్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. తనకు ప్రజల అభిమానం కంటే గొప్ప బలం మరొకటి లేదన్నారు. అందరికీ రేపు దీపావళి అయితే కొడంగల్ ప్రజలకు ఇవాళే దీపావళి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.





