Monday9 November 2026Hyderabad

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
Languages

Latest News

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

nagendra8 November 2026, 7:47 AM2 viewstrinetnews.com
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Share this story

Share link keeps your language (?lang=)

హుస్నాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పొన్నం కోమల–సమ్మయ్య ముదిరాజ్ దంపతుల నివాసంలో శుక్రవారం ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని లబ్ధిదారుల కుటుంబంతో దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కోమల–సమ్మయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇంటి ఆవరణలో బాణసంచా కాల్చి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. సొంతింటిలో దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. 500 గుడిసెల స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి, మధ్యలో నిలిచిపోయిన మరో 500 ఇళ్లకు, రెండో దశలో అదనంగా 1,000 ఇళ్లకు మంజూరు లభించిందని వివరించారు.

ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెండో దశలో మంజూరైన ఇళ్లకు సంబంధించి వారం, పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే రూఫ్ లెవల్‌కు చేరుకున్న లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ సొంతింట్లో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరడం ఆయా కుటుంబాలకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పొన్నం కోమల–సమ్మయ్య దంపతులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిపారు. ఈ ఏడాది సొంతింట్లో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also read