సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
22K₹1,32,331/10g+0.73%
భాషలు

తాజా వార్తలు

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

nagendra8 November 2026, 7:45 AM1 చూసులుtrinetnews.com
గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్గొండ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతోనే నల్గొండ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి ఏదుల నుంచి నీటిని తరలిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న ప్రతిపాదన ఆచరణలో అనేక సాంకేతిక, భౌగోళిక సమస్యలతో కూడుకున్నదని పేర్కొన్నారు. డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఆమె.. నల్గొండ జిల్లాకు గోదావరి జలాలను తీసుకురావడమే దీర్ఘకాలిక పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం అంత సులభం కాదన్నారు. శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకే రెండు టీఎంసీల నీటిని తరలించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు అదనంగా నీటిని తీసుకెళ్లే ప్రతిపాదన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎల్లూరు పంపుహౌస్ డిజైన్‌ను ఓపెన్ కట్ నుంచి అండర్‌గ్రౌండ్ విధానానికి మార్చడం వల్ల పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు.

ఎల్లూరు పంపుహౌస్‌లో నీటిని తీసుకునే స్థాయిని 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెంచారని, అప్రోచ్ చానల్ పొడవును 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించారని వివరించారు. అక్కడ చేపట్టిన బ్లాస్టింగ్‌ల కారణంగా కల్వకుర్తి పంపుహౌస్‌లో ఒక మోటారు దెబ్బతిన్నదని, ఇన్నేళ్లయినా దాన్ని పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరో 0.6 టీఎంసీల నీటి కోసం కొత్తగా పంపుహౌస్ నిర్మాణం చేపడితే కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బస్వాపూర్ మీదుగా గోదావరి జలాల తరలింపు

డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరును నిర్ణయించే ముందు సమగ్ర సర్వే, స్పష్టమైన సోర్స్ పాయింట్ ఉండాలని కవిత అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిసార్లు సర్వేలు చేసినా తుది నిర్ణయానికి రాలేదని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమగ్ర సర్వే, జీవో లేకుండానే ఏదుల నుంచి నీళ్లు తీసుకొస్తామని చెబుతోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుమారు 80 శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి, గోదావరి జలాలను నల్గొండకు తరలించాలని సూచించారు. మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్ మీదుగా ఉల్పరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉందని, ఈ మార్గంలో సుమారు 110 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని తెలిపారు. బస్వాపూర్‌ను పూర్తి చేస్తే శివన్నగూడెం రిజర్వాయర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని, ప్రత్యామ్నాయంగా కొండపోచంపల్లి నుంచి షామీర్‌పేట మీదుగా కూడా గోదావరి జలాలను తీసుకెళ్లవచ్చని వివరించారు.

గోదావరి జలాలను వినియోగించుకోకుండా కృష్ణా జలాల కోసం రెండు జిల్లాల మధ్య వివాదాన్ని సృష్టించడం సరికాదన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఈ ప్రాంతమంతా నదీ జలాలతో సస్యశ్యామలం కావాలని పేర్కొన్నారు. జిల్లాలో అవసరమైన చోట రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

రాష్ట్రంలో 80 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కవిత ఆరోపించారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. బస్వాపూర్, శివన్నగూడెం, కిష్టరాయపల్లి వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని కోరారు.

మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపుహౌస్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రతిపాదనల కంటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి నుంచి ఏటా భారీగా నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ తెలంగాణ అవసరాలకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని అన్నారు.

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చని, గోదావరి–కావేరి అనుసంధానాన్ని తుపాకులగూడెం వద్ద చేపట్టేలా చూడాలని అభిప్రాయపడ్డారు. నాగార్జునసాగర్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

రెండు జిల్లాల మధ్య వివాదం సృష్టించవద్దు

ఏదుల నుంచి ఉల్పరకు నీటిని తరలిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇందుకు అవసరమైన భూసేకరణ కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదని కవిత అన్నారు. సర్వేలు, అనుమతులు, భూసేకరణ, నిర్మాణ పనులు పూర్తయ్యేలోగా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. నీటి సమస్యను పరిష్కరించకుండా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజల మధ్య వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఏదుల నుంచి నీటిని తరలిస్తే తమ భూములు కోల్పోతామని కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతోపాటు వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించడమే తమ విధానమని చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణలు చెబుతున్నానని కవిత పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తమ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు.

ఫ్లోరైడ్ సమస్యకు గోదావరి జలాలే పరిష్కారం

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా తొలగాలంటే తాగునీరు, సాగునీటి అవసరాలకు నదీ జలాలను అందుబాటులోకి తీసుకురావాలని కవిత అన్నారు. రెండు నెలల క్రితం మరో ఫ్లోరైడ్ కేసు నమోదైన నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులతో చర్చించి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతోపాటు జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ముందుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.

రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా మారే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు వేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయే రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. రైతులకు సాగునీరు, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, దేవరకొండ–డిండి మార్గం సింగిల్ రోడ్డుగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర ప్రజా సమస్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

బీఆర్ఎస్‌పై విమర్శలు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరిన కవిత

ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రిని రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను నాన్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నది తమ పార్టీయేనని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. తమ పార్టీ బృందం చిన్నదైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల కోసం పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి