Monday9 November 2026Hyderabad

SENSEX81,080+5.41%
NIFTY24,996+4.98%
HYD 22K₹1,32,331/10g+0.73%
Languages

Latest News

అత్యున్నత సన్నద్ధతతో భద్రతా సవాళ్లను ఎదుర్కోవాలి సైబర్‌ భద్రత, సమాచార విశ్వసనీయతపై దృష్టి పెట్టాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌

nagendra8 November 2026, 7:36 AM0 viewstrinetnews.com
అత్యున్నత సన్నద్ధతతో భద్రతా సవాళ్లను ఎదుర్కోవాలి సైబర్‌ భద్రత, సమాచార విశ్వసనీయతపై దృష్టి పెట్టాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 7:

కొత్తగా ఉద్భవిస్తున్న భద్రతా ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు అత్యున్నత స్థాయి కార్యాచరణ సన్నద్ధతను కొనసాగించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. కార్యాచరణ పరిధిలోని పరిస్థితులపై అవగాహన, సైబర్‌ దాడులను తట్టుకునే సామర్థ్యం, సమాచార విశ్వసనీయతను బలోపేతం చేసుకోవాలని సూచించారు. దీపావళి సందర్భంగా శనివారం పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా వైమానిక స్థావరంలో వాయుసేన సిబ్బందితో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. యుద్ధం సరిహద్దుల్లో సంప్రదాయ పోరాటాలకే పరిమితం కాకుండా పరోక్ష దాడులు, సైబర్‌ దాడులు, డ్రోన్ల సమూహాలు, సమాచార యుద్ధం వంటి రూపాలకు విస్తరించిందన్నారు. ప్రత్యర్థులు నేరుగా తలపడకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలు, సైనికుల్లో అనుమానాలు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని హెచ్చరించారు.

ఈశాన్య భారత భద్రతలో బాగ్‌డోగ్రా వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమని రాజ్‌నాథ్‌ తెలిపారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వాయుసేన సిబ్బంది తూర్పు ప్రాంత రక్షణకు పటిష్ఠ కవచంగా నిలుస్తున్నారని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా క్రమశిక్షణ, ధైర్యం, సంయమనం అత్యవసరమన్నారు. స్థానిక ప్రజలతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రత్యర్థుల కుట్రలను బలహీనపరచవచ్చని సూచించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంతో దేశీయ అంకుర సంస్థలు, పరిశ్రమలు డ్రోన్లు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు, అధునాతన సైనిక పరికరాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయని తెలిపారు. స్వదేశీ సాంకేతికతను స్వీకరిస్తూ డ్రోన్‌ నిర్వహణ, సైబర్‌ భద్రతలో కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటున్న రక్షణ దళాలను అభినందించారు.

అగ్నివీరులకు ‘సెకండ్‌ టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’కి మంత్రివర్గం ఆమోదం తెలపడం ముఖ్యమైన దీపావళి కానుకగా మంత్రి అభివర్ణించారు. రెండేళ్ల అదనపు సేవాకాలం పూర్తయిన తర్వాత ఆసక్తి, నిర్దేశిత ఎంపిక ప్రమాణాలకు లోబడి రెగ్యులర్‌ సైనికులుగా చేరేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

వాయుసేన సిబ్బందికి, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాజ్‌నాథ్‌.. దేశ భద్రత కోసం వారు చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. సైనికుల కుటుంబాల సంక్షేమానికి దేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌, బాగ్‌డోగ్రా వైమానిక స్థావర అధిపతి ఎయిర్‌ కమోడోర్‌ మనీష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య