న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.
రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి ఆనందోత్సవాలు జరుపుకొన్నారని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. దీపావళికి ఈ ఘట్టం సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని చేకూర్చిందని, రామరాజ్య శుభారంభానికి కూడా ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
ప్రతికూల ధోరణులపై సద్గుణాల విజయాన్ని, కష్టాల ముగింపును, ఆనందమయమైన సుసంపన్న జీవన ప్రారంభాన్ని దీపావళి సూచిస్తుందని పేర్కొన్నారు. శుభారంభాలు, క్షేమం కోసం గణేశుడిని, సంపదల కోసం మహాలక్ష్మిని పూజిస్తూ అందరి సంతోషాన్ని కోరుకుంటారని వివరించారు.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, సామరస్యంతో జీవించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భారతీయ విలువల మార్గదర్శకత్వంలో దేశభక్తి కలిగిన యువత వికసిత్ భారత్ నిర్మాణంలో ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.





