హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:
వినియోగదారుల వివాదాలను పరస్పర చర్చలు, అవగాహనతో సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వాన్ని వినియోగదారుల న్యాయవ్యవస్థలో అంతర్భాగంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ పి. శామ్ కోశి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయపోరాటాలతో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, కమిషన్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఖైరతాబాద్‌లోని ఏరువాక భవన్లో నిర్వహించిన మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ–కామర్స్, డిజిటల్ వేదికలు, ఆన్లైన్ సేవలు విస్తరించడంతో వినియోగదారుల లావాదేవీల స్వరూపంతోపాటు వివాదాల అవకాశాలూ పెరిగాయని జస్టిస్ శామ్ కోశి అన్నారు. తటస్థ మధ్యవర్తి సహాయంతో ఇరుపక్షాలు స్వచ్ఛందంగా అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడమే మధ్యవర్తిత్వమని వివరించారు. ఈ ప్రక్రియలో నిష్పాక్షికతను పాటిస్తూ బలహీనవర్గాల ప్రయోజనాలను పరిరక్షించాలని సూచించారు. మోసం, ఫోర్జరీ, బలవంతం, తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం, నేరపూరిత అంశాలు, విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడిన వివాదాలకు న్యాయస్థాన విచారణ అవసరమని పేర్కొన్నారు.
మధ్యవర్తులకు నిరంతర శిక్షణ, ప్రత్యేక ప్యానెళ్లు, మౌలిక సదుపాయాలతో కూడిన కేంద్రాలు, సమర్థవంతమైన కేసుల సిఫార్సు విధానం అవసరమన్నారు. ఆన్లైన్ మధ్యవర్తిత్వంతో మారుమూల ప్రాంతాలకు న్యాయసేవలను చేరువ చేయవచ్చని, సాంకేతిక సదుపాయాలు లేనివారు ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని సూచించారు. ముందుగా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించి, అవసరమైతే న్యాయవిచారణకు వెళ్లే విధానాన్ని న్యాయవాదులు ప్రోత్సహించాలన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్య మాట్లాడుతూ ఫిర్యాదు దాఖలు దశలోనే మధ్యవర్తిత్వ అవకాశాన్ని కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో వ్యాజ్యానికి ముందు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం, ప్రత్యేక వినియోగదారుల హెల్ప్లైన్లు ఏర్పాటు చేయడం అవసరమన్నారు. వ్యాపార సంస్థలు, ఈ–కామర్స్ వేదికలు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ జి. రాధారాణి మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని కమిషన్ల రోజువారీ పనితీరులో సమర్థంగా అనుసంధానించాలని పేర్కొన్నారు. లోపభూయిష్ట ఉత్పత్తులు, సేవాలోపాలు, బీమా, బ్యాంకింగ్, గృహనిర్మాణ వివాదాల్లో సామరస్య పరిష్కారానికి అవకాశముందన్నారు.
నల్సార్ ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, వెబ్న్యాయ్ సీఈవో విశ్వమ్ జిందాల్ ఆన్లైన్ వివాద పరిష్కార వ్యవస్థ ప్రతిపాదనను వివరించారు. అనంతరం వినియోగదారుల హక్కులు, వివాద పరిష్కారంపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మధ్యవర్తిత్వం ద్వారా ఆరోగ్య బీమా క్లెయిమ్ వివాదం పరిష్కారమై, సంబంధిత పాలసీదారులకు బీమా సంస్థ రూ.12,32,104 చెల్లించింది. కార్యక్రమంలో పంచాక్షరి, సత్యేంద్ర, దేవేందర్, శ్యామ్ ప్రసాద్, జిల్లా వినియోగదారుల కమిషన్ల అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు పాల్గొన్నారు.





