సింగరేణి సిఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాలు
సింగరేణి భవన్, ట్రైనెట్ న్యూస్ నవంబర్ 07:
ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్ నుండి ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాల మేర బొగ్గు అధికోత్పత్తి సాధించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఓవర్ బర్డెన్ తొలగింపును పెంచాలని సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నైనీ గని పై సంస్థ డైరెక్టర్లు మరియు సంబంధిత జనరల్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షా నిర్వహించారు.
ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం నైనీగని నుండి రోజుకు కనీసం 20వేల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా జరపడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపును పెంచడం వల్ల ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది కనుక ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
ఈ సందర్భంగా నైనీ గని జనరల్ మేనేజర్ శ్రీ బైద్య ప్రస్తుతం గనిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు తదితర అంశాలను వివరించారు. బొగ్గు రవాణా సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ కోరారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డైరెక్టర్ {ఆపరేషన్స్} ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ {ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్} కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ {పర్సనల్ మరియు ఫైనాన్స్} గౌతమ్ పొట్రు, డైరెక్టర్ {ఈ అండ్ ఎం}, ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ తాడబోయిన శ్రీనివాస్ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ దేవేందర్ ఇంకా వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.





