సింగరేణి అమలు చేస్తున్న వినూత్న సీఎస్ఆర్ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు
CSRలో ఉన్నత విద్యార్హత సాధించిన డీజీఎం నిమ్మ భాస్కర్‌ను అభినందించి
సన్మానించిన సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి
సింగరేణి భవన్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 07:
బొగ్గు రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల అమలులో మరింత సమర్థతను పెంపొందించడం, ప్రాజెక్టుల రూపకల్పన, నిధుల సద్వినియోగం, పర్యవేక్షణ, మూల్యాంకనం, సామాజిక ప్రభావ అంచనా తదితర అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కోల్‌కతాలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) అధికారులు పాల్గొన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్ ) సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 4, 5 తేదీలలో “బొగ్గు రంగ సంస్థల కోసం ప్రత్యేక కార్పొరేట్ సామాజిక బాధ్యత విధానంపై రెండు రోజుల సామర్థ్యాభివృద్ధి శిక్షణ” పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఐసీఏ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ డీన్ ప్రొఫెసర్ గరిమా దధీచ్ బొగ్గు రంగ సంస్థలకు అనువైన ప్రత్యేక సీఎస్ఆర్ విధానాలు, సామాజిక అవసరాల ఆధారంగా ప్రాజెక్టుల ఎంపిక, ప్రణాళికాబద్ధమైన అమలు, నిధుల సమర్థ వినియోగం, పర్యవేక్షణ, ఫలితాల మూల్యాంకనం, దీర్ఘకాలిక సామాజిక ప్రభావం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సింగరేణి సంస్థ తరఫున హైదరాబాద్ కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐఈ), పరిపాలనాధికారి శ్రీ నిమ్మ భాస్కర్, సీఎస్ఆర్ విభాగం సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎస్.ఎం.డి. గౌస్ పాషా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రతినిధిగా నిమ్మ భాస్కర్ సంస్థ అమలు చేస్తున్న వివిధ ప్రతిష్ఠాత్మక సామాజిక బాధ్యత కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, అమలు విధానాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, సామాజిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం, జస్టిస్ ఆన్ వీల్స్, హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, జలవనరుల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాల ఏర్పాటు, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా తేనెటీగల పెంపకం ప్రోత్సాహం తదితర కార్యక్రమాలను వివరించారు.
స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగరేణి అమలు చేస్తున్న ఈ వినూత్న, ప్రజోపయోగ కార్యక్రమాల పట్ల కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు ప్రశంసలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
సీఎస్ఆర్ లో ఉన్నత విద్యార్హత సాధించిన నిమ్మ భాస్కర్‌కు సీఎండీ అభినందనలు
సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ నిమ్మ భాస్కర్ ఇటీవల ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో ) నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. సీఎస్ఆర్ రంగంలో ప్రత్యేక విద్యార్హత సాధించడంతో పాటు కోల్‌కతాలో జరిగిన జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమాలను సమర్థవంతంగా వివరించి, సంస్థకు ప్రశంసలు లభించేలా కృషి చేసిన నిమ్మ భాస్కర్‌ను సింగరేణి సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్) టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలే సీఎస్ఆర్ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం
సీఎస్ఆర్ కార్యక్రమాలు కేవలం నిధుల కేటాయింపు, వ్యయానికే పరిమితం కాకుండా, స్థానిక సమాజాల వాస్తవ అవసరాలను తీర్చడంతో పాటు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందించేలా రూపొందించి అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా వివరించారు.
సింగరేణి సంస్థ బొగ్గు గనుల పరిసర ప్రాంతాల ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ విద్య, వైద్యం, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో అనేక CSR కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇటువంటి జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల్లో అధికారుల భాగస్వామ్యం ద్వారా ఆధునిక సీఎస్ఆర్ విధానాలు, ఉత్తమ ఆచరణలు, సామాజిక ప్రభావ మూల్యాంకన పద్ధతులపై అవగాహన మరింత పెరుగుతుందని, తద్వారా సింగరేణి సంస్థ చేపట్టే సామాజిక బాధ్యత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాల ఆధారితంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని సంస్థ పేర్కొంది.





