గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 7:
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి ఆరోపించారు. శనివారం ఎయిటింక్లయిన్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామగుండం ఓసీపీ–3లో అద్దె ప్రాతిపదికన ప్రైవేటు డ్రిల్లింగ్ యంత్రాన్ని తీసుకొచ్చి, నిర్వహణతోపాటు మరమ్మతులనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని పేర్కొన్నారు. రెండు డ్రిల్లింగ్ యంత్రాలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మరో నాలుగు యంత్రాల కోసం ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం చేపడుతున్న కాంట్రాక్టీకరణకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సహకరిస్తున్నాయని విమర్శించారు.
రామగుండం ఓసీపీ–1లో బండ, మట్టి తొలగింపు పనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని అన్నారు. గతంలో 1,700 మంది కార్మికులు పనిచేసిన ఈ గనిలో ప్రస్తుతం వారి సంఖ్య 800కు తగ్గిందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణతో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రణాళిక లోపం, విడిభాగాల కొరతతో వందల కోట్ల రూపాయల విలువైన భారీ యంత్రాలు నిరుపయోగంగా మారుతున్నాయని రామమూర్తి ఆరోపించారు. కూలెంట్, ట్రాన్స్మిషన్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్, టైర్ల కొరతతో యంత్రాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. కార్మికులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వారి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు.
సమావేశంలో కార్మిక నాయకులు భేతి చంద్రయ్య, మామిడి తిరుపతి, దాసరి శ్రీనివాస్, శశాంక్, బి.శ్రీనివాస్, నరేందర్, మహేందర్, పి.శ్రీనివాస్, దినేష్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.





