Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

రాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

nagendra7 November 2026, 5:30 AM2 viewstrinetnews.com
రాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

Share this story

Share link keeps your language (?lang=)

\‎

‎ రాష్ట్ర ఆదాయ సమీకరణ వేగవంతంపై ప్రత్యేక దృష్టి

‎

‎ నిర్ణీత గడువుల్లో ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను సాధించాలి

‎

‎ ల్యాండ్ పూలింగ్, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి

‎

‎ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వారాలవారీగా లక్ష్యాలు

‎

‎ పారదర్శక విధానాలు, వనరుల సమర్థ వినియోగంతో భవిష్యత్ ఆదాయాన్ని పెంచాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 6:

రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో సాధించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ భూములు, పారిశ్రామిక లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఈ ప్రక్రియలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

‎శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు స్పష్టమైన లక్ష్యాలు, శాఖల మధ్య సమన్వయం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి శాఖ వారాలవారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. పారిశ్రామిక లేఅవుట్లు, పాత పారిశ్రామికవాడల్లో భూముల వినియోగం, క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటికే సమకూరిన ఆదాయం, వివిధ దశల్లో ఉన్న ప్రతిపాదనల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా నిర్ధేశిత ఆదాయ లక్ష్యాన్ని సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని భట్టి విక్రమార్క సూచించారు. పారిశ్రామిక భూములకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. బీ-కేటగిరీ, సూక్ష్మ పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

‎దరఖాస్తుల పరిష్కారానికి వారాలవారీగా లక్ష్యాలను నిర్ణయించి, సంబంధిత అధికారులకు స్పష్టమైన బాధ్యతలను అప్పగించాలని సూచించారు. రోజువారీ పురోగతిని పర్యవేక్షించడం ద్వారా పారిశ్రామికవేత్తలకు వేగవంతమైన, సులభతరమైన సేవలు అందేలా చూడాలన్నారు.

‎పారిశ్రామిక ప్రాంతాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరిస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

‎హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్, భవిష్యత్ అవసరాలకు భూముల లభ్యత, భూ వనరుల సమీకరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

‎భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో పాల్గొనే అన్ని వర్గాలకు స్పష్టతతో పాటు ప్రయోజనం కలిగేలా ప్రణాళికాబద్ధమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలన్నారు.

‎ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే భూ వనరులను అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని, అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

‎ప్రభుత్వ భూముల వినియోగంలో ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

‎రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి అత్యవసర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూముల కేటాయింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వ వాటాగా లభించే భూములను నిర్దిష్ట ప్రజా అవసరాలకు వినియోగించేందుకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన అంశాలను చట్టపరమైన నిబంధనలు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్రంగా పరిశీలించి, తగిన ప్రతిపాదనలను మంత్రివర్గ పరిశీలనకు సమర్పించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూముల అభివృద్ధి, వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను కూడా ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. వేలానికి అనువైన లేఅవుట్లను గుర్తించాలని, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం, అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భూముల వేలం ప్రక్రియను దశలవారీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భూముల వివరాలు, లేఅవుట్ల ప్రస్తుత స్థితి, వేలానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు, ముందస్తు ఏర్పాట్ల పురోగతి తదితర అంశాలతో కూడిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను వచ్చే వారంలోగా సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

‎ సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ భూములు, లేఅవుట్ల అభివృద్ధి, వేలం సంబంధిత కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలని సూచించారు.

‎ భూముల వివరాలు, లేఅవుట్ల స్థితి, వేలానికి సిద్ధంగా ఉన్న ప్లాట్లు, వివిధ కార్యక్రమాల పురోగతి వంటి సమగ్ర సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా శాఖల మధ్య సమన్వయం మెరుగుపడటంతో పాటు నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, భూముల వేలం ప్రక్రియలో పారదర్శకత మరింత పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‎ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం, ఆదాయ సమీకరణకు కొత్త మార్గాలను గుర్తించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర వనరులను సమర్థంగా సమీకరించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వృద్ధి, సమగ్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

‎

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

Read more →