న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:
భారత నౌకాదళానికి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జలాంతర్గాముల నిరోధక యుద్ధనౌక ‘అమిని’ని నవంబర్ 5న అప్పగించారు. తక్కువ లోతు జలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) రూపొందించి నిర్మించింది.
ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన అమిని, వాటర్‌జెట్ చోదక వ్యవస్థతో నడిచే భారత నౌకాదళంలోని అతిపెద్ద యుద్ధనౌకల్లో ఒకటి. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలను ఇందులో అమర్చారు. నీటి అడుగున ఉన్న ముప్పులను గుర్తించి ఎదుర్కొనేందుకు ఇవి ఉపయోగపడతాయి. జలాంతర్గాముల నిరోధం, తీరప్రాంత నిఘా, సముద్ర మందుపాతరల ఏర్పాటు సామర్థ్యాలను ఈ నౌక మరింత బలోపేతం చేయనుంది.
లక్షద్వీప్‌లోని అమిని దీవి పేరును ఈ నౌకకు పెట్టారు. గతంలో సేవలందించి 2002లో విరమణ పొందిన పెట్యా–III తరగతి జలాంతర్గాముల నిరోధక నౌక ‘ఐఎన్ఎస్ అమిని’ వారసత్వాన్ని ఇది కొనసాగిస్తోంది.
80 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో నిర్మించిన అమిని అప్పగింత దేశీయ నౌకా నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబనను పెంచుతూ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా ఇది కీలక ముందడుగు.





