న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:
భారత్–హంగేరీ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద హంగేరీలో పర్యటించారు. నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన ఈ పర్యటనలో ఉన్నతస్థాయి సమావేశాలు, వ్యాపార చర్చలు, పరిశ్రమల సందర్శనల్లో పాల్గొన్నారు.
హంగేరీ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌తో సమావేశమైన మంత్రి ద్వైపాక్షిక సంబంధాలు, భారత్–యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యంపై చర్చించారు. ఆ దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రితో జరిగిన భేటీలో ఆధునిక సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణల్లో పరస్పర సహకారాన్ని విస్తరించే అవకాశాలను పరిశీలించారు.
హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను సందర్శించి వ్యవసాయ పరిశోధన, అగ్రిటెక్, సుస్థిర సాగు విధానాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. ప్రముఖ ఔషధ సంస్థ గెడియన్ రిక్టర్‌ను సందర్శించి ఔషధ తయారీ, పరిశోధన, ఆరోగ్య సాంకేతికతల్లో సహకార అవకాశాలను పరిశీలించారు.
నవంబర్ 5న బుడాపెస్ట్‌లో నిర్వహించిన భారత్–హంగేరీ వ్యాపార సదస్సులో వందమందికి పైగా వ్యాపార ప్రతినిధులను ఉద్దేశించి జితిన్ ప్రసాద ప్రసంగించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఔషధాలు, వ్యవసాయం, ఆధునిక సాంకేతిక రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని ఇరు దేశాల సంస్థలకు పిలుపునిచ్చారు.
హంగేరీలోని ఫాక్స్‌కాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ పరికరాలు, ఏఐ సర్వర్ సాంకేతికతలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, డిజిటల్ మౌలిక వసతులు, పటిష్ఠమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టిసారించారు.
భారత రాయబార కార్యాలయం నిర్వహించిన సదస్సులో భారత వ్యాపార ప్రతినిధులు హంగేరీ వాణిజ్య, ఎగుమతి, పెట్టుబడి ప్రోత్సాహక సంస్థలతో చర్చించారు. ఇరు దేశాల కంపెనీల మధ్య వ్యాపార సమావేశాలు కూడా జరిగాయి. అమృతా షేర్‌గిల్ సాంస్కృతిక కేంద్రంలో భారతీయులతో ముచ్చటించిన మంత్రి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.





