హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబరు 6:
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతోపాటు, పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి తదితర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటికే పూర్తయిన పనులు, ఇంకా ప్రారంభం కావాల్సినవి, వివిధ దశల్లో కొనసాగుతున్న పనులపై శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్, కమిషనర్ దేవాదాయ శాఖ ఎం .హనుమంతరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ .బి. సత్య ప్రసాద్ లతో పాటు,ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ , ఇరిగేషన్ శాఖల అధికారులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యమైనవని, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదారులు, పుష్కర ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు తదితర మౌలిక వసతులను సమగ్రంగా కల్పించాలని సూచించారు. పుష్కరాల పనుల్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు (ఆర్అండ్బీ), దేవాదాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఒక శాఖ పనుల వల్ల మరో శాఖ పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పనుల నాణ్యతలో రాజీ వద్దు
పుష్కరాల కోసం చేపడుతున్న ప్రతి పనికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, ఇంకా ప్రారంభం కావాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం, పూర్తి చేయాల్సిన గడువులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తరచూ పర్యటిస్తూ పనుల నాణ్యతను పరిశీలించాలని, కాంట్రాక్టర్లు నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేకించి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాల రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు. పుష్కరాల సమయంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి నది పరిశుభ్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులకు తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
ధర్మపురి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ధర్మపురి ప్రాంతంలో సుమారు రూ.226 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలో భాగంగా పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు కొనసాగుతున్నాయి. ధర్మపురిలో సుమారు 470 మీటర్ల మేర కొత్త స్నాన ఘాట్ల అభివృద్ధి కూడా ప్రతిపాదిత పనుల్లో ఉంది. జూన్ 26 నుంచి జూలై 7, 2027 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో, అప్పటిలోగా అన్ని శాశ్వత, తాత్కాలిక పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు.





