హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:
ట్విట్టర్ టిల్లు అంటూ బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లోకి వారసత్వంతో వచ్చి పదవులు సంపాదించుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలదని, తాము మాత్రం ప్రజల కోసం పోరాడుతూ, లాఠీదెబ్బలు తింటూ, ఉద్యమాల ద్వారా కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు. తమది మెరిట్ కోటా అయితే, బీఆర్ఎస్ నేతలది మేనేజ్మెంట్ కోటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా పాదయాత్రకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో జనాన్ని నియంత్రించేందుకు తాను వెళ్లానని బండి సంజయ్ తెలిపారు. అయితే తనను బౌన్సర్ అంటూ హేళన చేయడం సరికాదన్నారు. పార్టీకి వచ్చిన జనసందోహాన్ని క్రమబద్ధీకరించేందుకు వెళితే బౌన్సర్‌గా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. బౌన్సర్లతో కార్యకర్తలపై దాడులు చేయించిన సంస్కృతి బీఆర్ఎస్దేనని విమర్శించారు. అధికారంలో ఉన్నంతకాలం కార్యకర్తలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని ఆరోపించారు. తెలంగాణలో భూములను అమ్మి దోచుకున్న ఘనత ఆ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ విస్మరించిందని, మియాపూర్ భూములను సైతం అడ్డికి పావుశేరుకు అమ్మి కేసీఆర్ కుటుంబం దోచుకోవాలని చూసిందని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసి, మియాపూర్ భూములను విక్రయించి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల మానవతా దృక్పథం అవసరం**
మహిళల మధ్య జరిగిన తోపులాటలో కిందపడి ఆర్టీసీ కండక్టర్ మరణించడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ఆర్టీసీ కార్మికులపై చూపించి వారిపై పగ తీర్చుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఎంతో ఓపికతో ప్రజలకు సేవలందిస్తున్నారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం పెన్షన్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం దుర్భరంగా మారుతోందన్నారు. ప్రతిరోజూ కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం, ప్రజలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.





