హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4:
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన వసతుల కల్పనలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆధునీకరించిన టెన్నిస్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, శంకర్ గీతా కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని, ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సీఎం కప్‌తో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.గతంలో నిరుపయోగంగా ఉన్న స్టేడియాలను పునరుద్ధరించి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఖేలో ఇండియా నిర్వహణలో హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్, పోలీస్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్రీడా పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనూ పోటీల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వంటి సంస్థలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు.క్రీడా అవకాశాలు జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల క్రీడాకారులకు సమానంగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నందున యువత క్రీడలను కూడా ఒక మంచి కెరీర్‌గా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్రీడాకారుల విజయాల్లో క్రీడా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు.మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు దక్కడం అంత సులభంగా సాధ్యపడలేదని, రాష్ట్రానికి ఈ అవకాశం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. దక్షిణ కొరియాలో కేవలం 32 ఎకరాల విస్తీర్ణంలోనే క్రీడా హబ్‌ను ఏర్పాటు చేసి, క్రీడా రంగంలో విశేష ఫలితాలు సాధిస్తున్నారని ఉదహరించారు. తెలంగాణలో వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉన్నందున అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఇటీవల ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారిణి చికితకు కూడా త్వరలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
క్రీడల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం లభిస్తుందని, క్రీడల్లో విజయం సాధించడానికి ఆర్థిక స్థోమత కంటే ప్రతిభ, నైపుణ్యం, కృషి, పట్టుదల ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణ అందించాలని, తద్వారా తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ఖేలో ఇండియా క్రీడల నిర్వహణను రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక అంశంగా పరిగణించి, అన్ని ప్రభుత్వ శాఖలు, క్రీడా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని, దేశవ్యాప్తంగా తెలంగాణ ఆతిథ్యం, నిర్వహణ సామర్థ్యం ప్రశంసలు పొందేలా సమష్టి కృషి చేయాలని మంత్రులు కోరారు.





