న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 04:
భారతీయ రైల్వేలో కార్మిక కోడ్ల సమర్థ అమలు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ కార్యాలయం రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. నవంబర్ 3న న్యూఢిల్లీలోని ద్వారకా శ్రమేవ జయతే భవన్లో కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ సోనాల్ మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
రైల్వే బోర్డు కార్మిక చట్టాల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీతా వర్మ తన బృందంతో కలిసి పాల్గొన్నారు. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (క్రిస్), జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) ప్రతినిధులు వర్చువల్గా హాజరయ్యారు.
కార్మిక కోడ్లలో రైల్వేలకు వర్తించే కీలక నిబంధనలు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన అంశాలు, నమోదు, లైసెన్సుల అవసరాలపై అధికారులు చర్చించారు. కొత్త కోడ్లకు అనుగుణంగా ‘శ్రామిక్ కళ్యాణ్ పోర్టల్’ను మెరుగుపరిచే సూచనలను పరిశీలించారు. నిబంధనల అనుసరణను సులభతరం చేయడంలో కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ కార్యాలయ పాత్రను వివరించారు.
రైల్వే సంస్థాగత నిర్మాణం, సిబ్బంది వినియోగం, కాంట్రాక్ట్ కార్మికుల నియామకం, వివిధ ప్రాంతాల్లోని రైల్వే కార్యాలయాలు, ప్రాజెక్టుల విస్తృతిపై వినీతా వర్మ వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాల అనుసరణ విధానాలు, ఉత్తమ పద్ధతులను తెలియజేశారు.
రైల్వే డిజిటల్ వ్యవస్థలను ‘శ్రమ సువిధ’, ‘సమాధాన్’ పోర్టళ్లతో అనుసంధానించే అవకాశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వివిధ అధికార పరిధుల్లో కార్మిక కోడ్ల అమలుకు ఎదురయ్యే నిర్వహణపరమైన సవాళ్లను పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో ఇరు సంస్థల అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచి, రైల్వే రంగ అవసరాలకు అనుగుణంగా కార్మిక కోడ్ల అమలును సులభతరం చేయడం ఈ సమావేశం లక్ష్యం. నాలుగు కార్మిక కోడ్లపై అవగాహన, నిబంధనల అనుసరణ, డిజిటల్ సేవల విస్తరణ కోసం వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలతో ఇటువంటి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ కార్యాలయం తెలిపింది.





