హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:
కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డిని ఆశీర్వదించి మండలికి పంపాలని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చదువు, సంస్కారం కలిగి, ప్రతి ఒక్కరినీ గౌరవించే వ్యక్తిత్వం ఉన్న సర్వోత్తం రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటారని, తండ్రి, పెద్దనాన్న మంత్రులుగా పనిచేసినా ఏనాడూ అధికారం చెలాయించలేదని అన్నారు. వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, అందుకే ఈసారి సర్వోత్తం రెడ్డికి పార్టీ అవకాశం కల్పించిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. కారుణ్య నియామకాలు చేపట్టామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. పెండింగ్ బకాయిలను నెలకు రూ.1,000 కోట్ల చొప్పున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటికే రూ.4,500 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. కొత్త నిబంధనల పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలలను ఇబ్బందులకు గురిచేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక టీంగా పనిచేస్తూ ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేని 'అవుట్ ఆఫ్ కవరేజ్' ప్రభుత్వంగా ఉండేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ప్రతి గ్రామంలోనూ అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారు వీలైనంత త్వరగా తమ ఓటును నమోదు చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్వోత్తం రెడ్డికి మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని, సర్వోత్తం రెడ్డిని ఆశీర్వదించి మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.





