హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,
నవంబర్ 3: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అక్రమ తొలగింపులు జరిగాయని తెలంగాణ వోటర్ రైట్స్ ఫోరం (TVRF) ఆరోపించింది. ఈ ప్రక్రియలో ఎదురైన లోపాలు, బాధిత ఓటర్ల అనుభవాలను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించింది. ముషీరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సామాజిక ఆడిట్, ప్రజా విచారణల ఆధారంగా పలు కీలక అంశాలను బయటపెట్టింది.
ఫోరం ప్రతినిధి డాక్టర్ ఎ. సునీత వివరాల ప్రకారం, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 150, 151 బూత్‌ల పరిధిలో 757 మంది ఓటర్లను ప్రత్యక్షంగా సర్వే చేయగా, 232 మంది పేర్లు తొలగింపు జాబితాలో ఉన్నాయని, వారిలో 43 మంది ఓట్లు అన్యాయంగా తొలగించబడ్డాయని గుర్తించారు. మరో 383 మందికి నోటీసులు అందాయి. ముషీరాబాద్‌లో సర్వే చేసిన 95 మంది తొలగించబడిన ఓటర్లలో 42 మంది ఓట్లు అన్యాయంగా తొలగించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో బాధిత ఓటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ, తమ పేర్లను 'అందుబాటులో లేరు' అనే కారణంతో తొలగించారని వాపోయారు. ప్రజా విచారణలో పాల్గొన్న ప్రొఫెసర్ జి. హరగోపాల్, డాక్టర్ పరాకాల ప్రభాకర్, ప్రొఫెసర్ పద్మజా షా, మరియా తబస్సుమ్, సిస్టర్ మంజుల, న్యాయవాది ఎస్.క్యూ. మసూద్ తదితరులు ఎస్ఐఆర్ ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలను డాక్టర్ పరాకాల ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఓటర్ల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలంటే వోటర్ రైట్స్ ఫోరం నిర్వహించిన ప్రజా విచారణలను సందర్శించాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ వలసదారుల పేరుతో ఓటర్ల తొలగింపును సమర్థించడం సరికాదని విమర్శించారు. ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్లో మహిళలు, మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, కార్మిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, 2025 మార్గదర్శకాలను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, 2023 ఎన్నికల కమిషన్ చట్టాన్ని రద్దు చేయాలని ఫోరం డిమాండ్ చేసింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ప్రస్తుత లోపభూయిష్ట ఓటర్ల జాబితాలను ఉపయోగించకుండా, 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ప్రజా ఆడిట్ నిర్వహించి కొత్త జాబితాలను రూపొందించాలని కోరింది.





