ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం...
"తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం" అనే సామెత సమాజంలో కృతఘ్నతను, నమ్మకద్రోహాన్ని ప్రతిబింబించే అద్భుతమైన సూక్తి. మనకు కష్టకాలంలో ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టి ఆదరించిన వారికి కీడు చేసే దుర్మార్గుల గురించిన సామాజిక వాస్తవాన్ని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
పూర్వకాలంలో ఇళ్లను కలప, దూలాలతో నిర్మించేవారు. ఎవరైనా ఆపదలో ఉన్నవారు ఆశ్రయం కోరి వచ్చినప్పుడు, పెద్దమనసుతో వారిని ఆదరించి ఆశ్రయం ఇచ్చేవారు. కానీ కొందరు దుర్మార్గులు ఆ ఇంట్లో సుష్టుగా భోంచేసి, విశ్రాంతిగా పడుకొని... ఆ ఇంటికి ఎన్ని దూలాలు ఉన్నాయి, వాటిని ఎలా కాజేయాలి? లేదా "నాలాంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే వీళ్ళు మాత్రం సుఖంగా ఉన్నారు, వీళ్ళని ఎలా పడగొట్టాలి?" అని ఆలోచిస్తూ ఉంటారు. దీనినే 'తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం' అంటారు.
నేటి ఆధునిక సమాజంలో ఇలాంటి ధోరణి మరీ ఎక్కువగా కనబడుతోంది. కొంతమంది ఒక వ్యాపారి దగ్గర నమ్మకంగా చేరి, పని నేర్చుకొని, అతని వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకుంటారు. చివరికి ఆ యజమానికే నష్టం కలిగిస్తూ, తప్పుడు మార్గంలో సంపాదిస్తూ, ఆ సంపాదించిన దానితో సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారు. ఇది ఒక రకమైన నమ్మకద్రోహం.
ఇక కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. వారికి రెక్కలు ఇచ్చి, ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తారు. ఆఖరుకు వారి ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఉన్న ఆస్తిని కూడా తెగనమ్మే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి కన్నవారిని వృద్ధాప్యంలో రోడ్డున పడేసే పిల్లలు ఈ రోజుల్లో ఎందరున్నారో మనకు తెలియదా? మనం నిత్యం చూస్తున్న చేదు నిజాలు అవే కదా!
రాజకీయాల విషయానికి వస్తే... ఒక పార్టీ ద్వారా సమాజంలో గుర్తింపు తెచ్చుకొని, పదవులను అనుభవించి, సమయం చూసి అదే పార్టీకి లేదా తమను పైకి తెచ్చిన నాయకుడికి వెన్నుపోటు పొడిచేవారు ఎందరో ఉన్నారు. వారు వేరే పార్టీకి మారటమో లేదా సొంతంగా వేరే పార్టీని ఏర్పాటు చేసుకోవడమో చేస్తుంటారు. ఈ ధోరణి ఈ కాలంలో ఒక సహజ ధోరణిగా మారిపోయింది.
నిజానికి శత్రువునైనా క్షమించవచ్చు కానీ, నమ్మకద్రోహం చేసిన విశ్వాసఘాతకులను ఆ దేవుడు కూడా క్షమించడు. వారి ఘాతకత్వం బయటపడిన నాడు సమాజం వారిని గౌరవించకపోగా చీదరించుకుంటుంది. ఆ ప్రభావం వారి మీద మాత్రమే కాదు, వారి కుటుంబంలో ఉన్న అమాయక వ్యక్తుల మీద కూడా పడుతుంది.
వీటన్నిటికీ కారణం స్వార్థం. "తమ స్వలాభం కోసం ఎవరినైనా మోసం చేయవచ్చు, నేను బాగుంటే చాలు పక్కవాడు నాశనమైనా పరవాలేదు" అనుకునే వ్యక్తులు ఒకరకమైతే... "నేను బాగున్నా, బాగోకున్నా పక్కవాడు మాత్రం బాగుండకూడదు" అనుకునే కుళ్ళు బుద్ధి గల వ్యక్తులు ఈ రోజుల్లో బాగా ఎక్కువయ్యారు. ఇలాంటి వారు కష్టాలు పడేటప్పుడు "మేం ఏం పాపం చేశాం?" అని ఏడుస్తారు. అప్పుడు వారికి తాము చేసిన ద్రోహాలు గుర్తుకు రావు. పాపాలంటే వేరే ఏవో కావు, మంచి చేసిన వారికి కీడు చేయడమే మహాపాపం. ఎప్పటికైనా ఆ పాపఫలితాన్ని అనుభవించక తప్పదు.
విశ్వాసం అనేది మానవ సంబంధాలకు పునాది వంటిది. జంతువులు కూడా తమకు అన్నం పెట్టిన యజమాని పట్ల ఎంతో కృతజ్ఞతతో, విశ్వాసంగా ఉంటాయి. కానీ బుద్ధి ఉండి, ఆలోచించగలిగే మనిషి మాత్రం స్వార్థంతో తనకు మంచి చేసిన వారికే ద్రోహం చేస్తాడు. ఇటువంటి వారి వలనే సమాజంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతోంది. దీనివల్ల నిజంగా ఆపదలో ఉండి సహాయం కోరే వారికి కూడా సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేని దుస్థితి ఏర్పడుతోంది. కనుక ప్రతి ఒక్కరూ మానవత్వంతో మసలుకోవడం, విశ్వాసాన్ని కలిగి ఉండటం అలవర్చుకోవాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, అందరూ బాగుంటారు.
శుభోదయం ... శశిబాల





